ANDRAPRADESH: ఏ రాజకీయ పార్టీకైనా తమ పార్టీ నుంచి సాధారణ కార్యకర్త వెళ్ళినా ఎంతో కొంత బాధ ఇబ్బంది ఉంటుంది. By: PASCHIMA VAHINI అయితే ఒక రాజకీయ పార్టీగా సుదీర్ఘ కాలం మనుగడులో ఉన్న తెలుగుదేశంతో సమానంగా పదిహేనేళ్ళ వయసు మాత్రమే ఉన్న వైసీపీలో పెద్ద ఎత్తున జంపింగ్స్ జరుగుతున్నాయి. వైసీపీ నుంచి 2014 మొదలుపెడితే ఈ రోజు దాకా వెళ్ళిన వారు ఎంతో మంది. ఆ మాటకు వస్తే పార్టీ పునాదుల నుంచి ఉన్న వారు కూడా గోడ దాటేయడం జరిగింది. బహుశా ఇది మరే పార్టీలో ఇంత రేంజిలో ఉండదేమో అని అంటారు. దానికి కారణం వైసీపీ అధినాయకత్వం అతి విశ్వాసం ధీమా కావచ్చు. దానిని వారు ఆత్మ విశ్వాసంగా చెప్పుకోవచ్చు కూడా. వైసీపీ ఏక శిలా సదృశ్యం . ఒక్కడితోనే ఏర్పడింది. ఇంత దాకా వచ్చింది.
మళ్ళీ ఆ ఒక్కడుతోనే నిర్మాణం అవుతుంది అన్నదే ఆ పార్టీ థియరీ. కానీ పార్టీ అన్నాక అందరూ ఉండాలి. నాయకుడి ప్రజాకర్షణ శక్తి ఒక చోదక శక్తిగా పనిచేస్తుంది. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీ పటిష్టంగా ఉండాలీ అంటే కనుక కచ్చితంగా అందరినీ పార్టీ లైన్ లో ఉంచుకోవాలి. అలాగే పార్టీ కోసం ఉంచుకోవాలి. అయితే వైసీపీలో ఎవరినీ బతిమాలే సీన్ ఉండదు. వారు పోతామంటే సైలెంట్ గా ఓకే అనేస్తారు అని చెబుతారు. అలా చాలా మంది బిగ్ షాట్స్ ని వైసీపీ పోగోట్టుకుంది. ఇక చూస్తే కనుక ఓటమి తరువాత గడచిన పదకొండు నెలల కాలంలో వైసీపీ నుంచి ఎందొరో బయటకు వెళ్ళిపోయారు. ముఖ్యంగా పదవులలో ఉన్న వారు పార్టీ మారడం విశేషమే. రాజ్యసభ సభ్యులు అలా నలుగురు పార్టీ నుంచి బయటకు వచ్చారు.
ఇక ఎమ్మెల్సీలుగా ఉన్న వారు కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ ప్రక్రియ అలా కొనసాగుతోంది కూడా. ఆ విధంగా చూస్తే తాజాగా శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న జకియా ఖానం వైసీపీకి తన పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీని వల్ల వైసీపీకి భారీ షాక్ అని అంతా అంటున్నారు. అయితే వైసీపీ నిబ్బరంగానే ఉంది. ఎందుకంటే ఆమె కంటే ముందు ఒక అయిదురుగు వైసీపీని రాజీనామాలు చేశారు. వారంతా రాజీనామాలు చేసి నెలలు గడుస్తున్నా అవి ఆమోదముద్ర పొందలేదు. ఎందుకంటే శాసనమండలిలో చైర్మన్ గా ఉన్న వారు వైసీపీకి చెందిన కొయ్యె మోషెన్ రాజు. ఆయన వీటి మీద నిర్ణయం తీసుకోవాలి. ఆయన నిర్ణయం ప్రకటించడానికి కాల పరిమితి లేదు. ఆయన విచక్షణాధికారం బట్టి నిర్ణయం ప్రకటించవచ్చు.
దాంతో ఈ రాజీనామాలు అక్కడ పెండింగులో ఉన్నాయి. దాంతో టెక్నికల్ గా వారంతా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలుగానే ఉంటారు. వారి రాజీనామాలు ఆమోదం పొందితేనే అవి కూటమికి దక్కుతాయి. మరో రెండేళ్ళకు పైగా మోషెన్ రాజు పదవీ కాలం ఉంది. అందువల్ల వైసీపీకి ఈ రాజీనామాల వల్ల ఇప్పట్లో వచ్చిన ముప్పేమీ లేదు అని అంటున్నారు. సో ఈ రోజున జకియా ఖానం రాజీనామా చేసినా రేపు మరొకరు చేసినా వైసీపీ బేఫికర్ గా ఉండవచ్చు అని అంటున్నారు. మరో వైపు చూస్తే రాజీనామాలు చేసి వెళ్తున్న వారు కూడా వైసీపీలోనే ఉన్నత స్థానాలు అందుకున్న వారు తప్ప వారు బయటకు వెళ్ళి ఆ రేంజిలో సాధించేది ఏదీ ఉండదని అంటున్నారు. అదే విధంగా చూసుకుంటే కనుక బలమైన నాయకులు ప్రజాకర్షణ నాయకులు వైసీపీలో జగన్ తరువాత ఆ స్థాయిలో ఎవరూ లేరు అని అంటున్నారు. ఇక వైసీపీలో నంబర్ టూ అన్నది లేదు. వన్ టూ థౌసండ్ జగనే కాబట్టి ఆ పార్టీ ఎపుడూ ధీమాగానే ఉంటుంది అని అంటున్నారు.