ANDRAPRADESH, AMARAVATHI: రాజధాని అమరావతి నిర్మాణానికి అదనపు భూ సమీకరణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ చేస్తున్న ప్రకటనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. By: PASCHIMA VAHINI NEWS రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 5 వేలు ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2500 ఎకరాలు, పరిశ్రమలకు 2500 ఎకరాలు అవసరం అంటూ మంత్రి నారాయణ చేసిన ప్రకటనపై రాజధాని రైతులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సేకరించిన భూములు అభివృద్ధి చేయకుండా కొత్తగా పది వేల ఎకరాలు సమీకరించాలనే ప్రకటనలపై టీడీపీ క్యాడర్ కూడా విమర్శలు గుప్పిస్తోందని అంటున్నారు. మరోవైపు ఇప్పటివరకు రాజధానిపై నోరుమెదపని వైసీపీకి ప్రభుత్వం అవకాశమిస్తున్నట్లు అవుతోందని టీడీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
పదేళ్ల క్రితం రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న 34 వేల ఎకరాలు సరిపోదని కొత్తగా మరో 10 వేల ఎకరాలు సమీకరించడానికి చేస్తున్న ప్రయత్నంతో అసలుకే ఎసరు వస్తుందనే భయం టీడీపీ కేడరులో కనిపిస్తోందని అంటున్నారు. ఇదే విషయమై రాజధాని రైతుల్లోనూ అనుమానాలు ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిరోజుల క్రితం వారిని పిలిచిపించి మాట్లాడారు. కానీ, వారి అభ్యంతరాలు వినకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాల్సినది ఏదో చెప్పారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి కొనసాగింపుగా మంత్రి నారాయణ చేస్తున్న ప్రకటనలతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని చర్చ జరుగుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. 31 వేల కోట్ల నిధులు సేకరించడంతోపాటు పనులకు టెండర్లు పిలిచింది. ఈ నెల 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై సానుకూలత కనిపిస్తున్నా, ఇప్పుడు పది వేల ఎకరాలు కావాలంటూ చేస్తున్న ప్రకటనలు అంతకంత నష్టం చేస్తున్నాయని అంటున్నారు. పదకొండు నెలలుగా పనులు మొదలుకాకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్తగా మరింత భూమి కావాలని సంప్రదింపులు మొదలు పెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తొలుత సమీకరించిన భూమిని అభివృద్ధి చేయకుండా కొత్తగా మళ్లీ భూ సమీకరణ అంటుండటంపై తెలుగుదేశం నేతలు కూడా వణికిపోతున్నారు. ఈ విషయంలో పార్టీ పునరాలోచన చేయకపోతే విపక్షానికి స్వయంగా అస్త్రం ఇచ్చినవారు అవుతామని పలువురు సీనియర్ నేతలు మదనపడుతున్నారు. అయితే తమ ఆలోచనలను పార్టీలో ఎవరికీ చెప్పుకోవాలో అర్థంకాక అంతర్గత సమావేశాల్లో తోటివారితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేశ్ తమ ఫోకస్ మొత్తం రాజధానిపై పెట్టారని అంటున్నారు. వారి ప్రయత్నాలను స్వాగతిస్తున్న నేతలు.. కొత్తగా సమీకరణ అన్న విషయాన్ని మాత్రం ఆమోదించలేకపోతున్నారని అంటున్నారు. ఈ విషయమై రాజధాని రైతుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాజధానికి సమీపంలో గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా, కొత్తగా మరో విమానాశ్రయడం కడతామనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం కడతామనే తమ ప్రతిపాదనకు ఉమ్మడి రాష్ట్రంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదహరిస్తున్నారు. అయితే హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాలకు శంషాబాద్ విమానాశ్రయానికి సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినప్పటికీ మరో విమానాశ్రయం లేకపోవడం వల్ల అంతదూరంలో కట్టడం, హైదరాబాద్ నగరం అటువైపు విస్తరించడంతో అభివృద్ధి చెందిందనే అభిప్రాయం ఉంది. కానీ, రాజధాని అమరావతికి గన్నవరం కేవలం 30 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా రాజధానితోపాటు గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి గతంలో భూమి సమీకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి చేయకుండా, అమరావతిలో మరో విమానాశ్రయం నిర్మిస్తామనే ప్రతిపాదనపై రైతుల నుంచి కూడా వ్యతిరేకత వస్తోందని అంటున్నారు.
అమరావతిని దృష్టిలో పెట్టుకునే గతంలో గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ విమానాశ్రయం ఉండగా, మరో విమానాశ్రయం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాజధాని నగరం ఇంకా రూపుదిద్దుకోలేదు. ఇప్పుడిప్పుడే ఆ దిశగా తొలి అడుగు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న భూమి అభివృద్ధి చేయకుండా, కొత్తగా సమీకరణ అంటూ భారం పెంచుకోవడం ఎందుకని? టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. అయితే అధిష్ఠానం వద్ద భయంతో ఎవరూ బహిరంగంగా నోరువిప్పడం లేదని అంటున్నారు. ముందుగా గతంలో సేకరించిన 34 వేల ఎకరాలను అభివృద్ధి చేసి ఆ తర్వాత అదనపు భూమిని సమీకరిస్తే బాగుంటుందని అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారు. అయితే పిల్లి మెడలో గంట కట్టేదెవరు? అన్నట్లు ఈ విషయాన్ని అధినేత చంద్రబాబుకు చెప్పే సాహసం ఎవరూ చేయడం లేదని అంటున్నారు.