Hot Posts

6/recent/ticker-posts

సైనికుల కోసం పవన్ సంచలన నిర్ణయం


ANDRAPRADESH: ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ తో యుద్ధం జరుగుతున్న వేళ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వంలో సొంతంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం.. తన విశిష్ఠ అధికారాలతో సైనికుల సంక్షేమానికి గొప్ప వరం ప్రకటించారు. పవన్ తీసుకున్న నిర్ణయంతో ఏపీలో సైనిక దళాల్లో పనిచేస్తున్న జవాను నుంచి అన్ని క్యాడరుల అధికారులకు మేలు జరగనుంది. శత్రువుతో విరోచితంగా పోరాడుతున్న సైనికులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భరోసానిచ్చారు. 


ఎక్స్ లో పోస్టు ద్వారా సైనికుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘ సాహసాలు చూపుతున్న సైనికులను గౌరవించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని భారత రక్షణ దళాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయిస్తున్నాం’’ అంటూ ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్. 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ ప్రకారం ఏపీలో సొంత ఇళ్లు ఉన్న సైనికులు, మాజీ సైనికులు ఇక నుంచి ఆస్తి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ సౌకర్యం కేవలం మాజీ సైనికులకు మాత్రమే ఉండేది. సర్వీసులో ఉన్నవారికి కూడా మినహాయింపునివ్వాలని ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిధిలోని పంచాయతీ రాజ్ శాఖలో ఈ కీలక నిర్ణయం అమలు చేయడం గమనార్హం. 

ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీల్లో పనిచేస్తున్న వారితో పాటు పారా మిలటరీలో పనిచేస్తున్న వారికి కూడా ఆస్తి పన్ను మినహాయింపు వర్తిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ తన ట్వీట్ లో తెలిపారు. మన జవాన్ల ధైర్యాన్ని అచంచలంగా గౌరవిస్తున్నామనే సంకేతాలు ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు. యూనిఫాం ధరించిన వీరులకు ఆంధ్రప్రదేశ్ కృతజ్ఞతకు చిహ్నంగా ఆస్తిపన్ను మినహాయింపు నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

తమ ప్రభుత్వం ప్రతి సైనికుడి కుటుంబానికి అండగా నిలుస్తుందని, వెలకట్టలేని వారి సేవలను గౌరవిస్తామని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రక్షణ దళాల సిబ్బందికి ప్రోత్సాహంగా ఉంటుందని అంటున్నారు.