Hot Posts

6/recent/ticker-posts

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే.. ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దాం


డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం, బ్యూరో: ప్రముఖ సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కీర్తింపబడుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు. 

మహాత్మ పూలే జయంతి సందర్భంగా రామచంద్రపురం నియోజవర్గంలో జరిగిన పలు జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యాలయంలోనూ, ద్రాక్షరామం కూడలిలోనూ, మున్సిపల్ కార్యాలయంలోనూ వాసంశెట్టి సత్యం , జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొలిశెట్టి చంద్రశేఖర్, కూటమి నాయకులుతో కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన జయంతి కార్యక్రమంలో వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాల పీడిత ప్రజల కోసం ఎనలేని సేవలు, త్యాగాలు చేశారని గుర్తు చేశారు. మెరుగైన సమాజ నిర్మాణం కోసం, స్త్రీ జాతి అభ్యున్నతి, విద్య కోసం అలుపెరగని కృషి చేశారని కొనియాడారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారత లక్ష్యంగా పూలే చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. 

మహాత్మ జ్యోతిరావు పూలే ఆలోచన విధానాలు యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా, భావితరాలకు, నేటి ఆధునిక సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి అనటం అతిశయోక్తి కాదన్నారు. అలాగే కుల వ్యవస్థ నిర్మూలన కోసం, మహిళా లోకం అభివృద్ధి కోసం 'సత్యశోధక్ సమాజ్' ను పూణేలో స్థాపించి ఎనలేని సేవలు అందించారన్నారు. పూలే ఆశయాలు, ఆదర్శాలు పాటించడం ద్వారా సమ సమాజాన్ని, సాధికారతను సాధించగలమని అన్నారు. 

రామచంద్రపురం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ స్త్రీ జనోదరణ కోసం మహాత్మ పూలేతో పాటు, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే కూడా ఎనలేని కృషి చేశారన్నారు. స్త్రీ విద్యను ప్రోత్సహించి, సమాజంలో మూఢాచారాలను నిర్మూలించేందుకు కృషి చేశారన్నారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాదం శెట్టి శ్రీదేవి, రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలరావు, ఎజిపి కమల కుమారి, రామచంద్రపురం నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, పలువురు న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.