Hot Posts

6/recent/ticker-posts

చదువులో మాత్రం గెలిచింది.. మృత్యువు చేతిలో ఓడింది..


నంద్యాల జిల్లాలో విషాదకరమైన ఘటన
‘పది’ ఫలితాల్లో సారాకు 557 మార్కులు
ఫలితాలకు ఐదురోజుల ముందే ఆమె మృతి


NANDYALA, AP NEWS: చిన్నతనం నుంచి కష్టపడి చదివింది.. పదో తరగతి పరీక్షలు బాగా రాసింది. కచ్చితంగా మంచి మార్కులు వస్తాయని ఫలితాల కోసం ఎదురు చూస్తూ.. గొప్ప భవిష్యత్‌ కళ్ల ముందు ఊహించుకుంది. పాపం చివరికి మృత్యువు చేతిలో ఓడింది.. చదువులో మాత్రం గెలిచింది. ఏపీ టెన్త్ ఫలితాల తర్వాత నంద్యాల జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ ఎమోషనల్ అవుతున్నారు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేములకు చెందిన దేవరాజు, మరియమ్మలకు ఐదుగురు కుమార్తెలు సంతానం.. కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు.

దేవరాజు, మరియమ్మల నాలుగో కుమార్తె సారా దొర్నిపాడు జెడ్పీహెచ్‌ స్కూల్‌లో పదో తరగతి చదివి పరీక్షలు రాసింది. బాగా కష్టపడిన చదివిన సారా తనకు 500కుపైగా మార్కులు వస్తాయని అంచనా వేసింది. మరో ఐదు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఎదురుచూస్తున్న సమయంలో ఊహించని పరిణామం ఎదురైంది. ఉన్నట్టుండి సారా అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు.. 

అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 19న ప్రాణాలు కోల్పోయింది. బుధవారం (ఏప్రిల్ 23న) విడుదలైన ఫలితాల్లో సారాకు ఏకంగా 557 మార్కులు వచ్చాయి. కూతురు చనిపోయిన ఐదు రోజుల తర్వాత ఐదు రోజులకు పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని తలచుకుని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు.

తమ కుమార్తె సారా చనిపోయే ముందు 500 పైగా మార్కులు వస్తాయని తమకు చెప్పిందని గుర్తుకు తెచ్చుకుంటూ ఆమె తండ్రి కంటతడి పెట్టారు. బాగా చదివి భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలని కలకలం కనిందని.. బాగా చదివి పదోతరగతి పరీక్షలు రాసిందని చెబుతున్నారు. అయితే పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా.. ఇలా అనారోగ్యం రూపం తమ కుమార్తెను బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తెను తలచుకుని ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఈ ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరి మనసు చలించింది. సారా గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.