Hot Posts

6/recent/ticker-posts

పాకిస్తాన్ తో యుద్ధం : ‘ఇందిరమ్మ’ ఐడియానే బెటర్ అట?


INDIA, ANDRAPRADESH: వైసీపీ ఎంపీ పదవికీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత విజయసాయిరెడ్డి రోజుకో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కాంపై సంచలన విషయాలు బయటపెట్టిన సాయిరెడ్డి.. తాజాగా కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిపై స్పందిస్తూ వార్తల్లోకెక్కారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఓ కీలక సలహా ఇచ్చారు. 


పాకిస్తాన్ పీచమణచాలంటే ఏం చేయాలో తేల్చి చెప్పారు. భారత్ లో సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును తీవ్రంగా తప్పుబడుతూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన పలు ప్రశ్నలు సంధించారు. "ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? దావూద్ ఇబ్రహీం ఎక్కడ నివసిస్తున్నాడు? మసూద్ అజార్ ఎక్కడ దాక్కున్నాడు?" అని ప్రశ్నిస్తూ, దీనికంతటికీ ఒకే సమాధానం - పాకిస్తాన్ అని సాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ఎగుమతిదారు పాకిస్తాన్ అని ఆయన ఆరోపించారు. 

1971 రిపీట్ చేయండి: సాయిరెడ్డి సలహా పాకిస్తాన్ ఉగ్రవాదానికి విరుగుడుగా భారత్ ఏం చేయాలో విజయసాయిరెడ్డి తన సలహా రూపంలో సూచించారు. భారతదేశం పష్తున్ , బలోచ్ ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అలాగే పాకిస్తాన్ నుండి పుట్టిన కొత్త దేశాలతో 1971 నాటి చారిత్రక సంఘటనను పునరావృతం చేయాలంటూ కేంద్రాన్ని సూచించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పై 1971 తరహాలోనే మరోసారి యుద్దం చేయాలంటూ దేశంలో డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి కూడా దాన్నే సమర్ధించారు. 

1971లో పాకిస్తాన్ పై జరిగిన యుద్దంలో భారత సేనలు వీరోచితంగా పోరాడి, ఆ దేశంలోని తూర్పు భాగాన్ని విడగొట్టి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేశాయి. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన ఈ యుద్ధం భారత్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు దాన్ని కొత్త మిత్రులైన పష్తూన్ (పాక్-ఆప్ఘన్ సరిహద్దుల్లో నివసించే గిరిజనులు), బలోచ్ (పాకిస్తాన్ లోని గిరిజన ప్రాంతాల్లో నివసించేవారు)తో కలిసి రిపీట్ చేయాలని విజయసాయిరెడ్డి తన సలహా ద్వారా కోరుతున్నారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ కీలక డిమాండ్ సలహాపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.