ఏలూరు, ఫిబ్రవరి 23: కౌలు రైతుల రక్షణ కోసం నూతన కౌలు చట్టం తీసుకురావాలని, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల పెట్టుబడి సాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలు చేస్తున్నాయని, రైతులకు అవసరమైన అనుకూల చట్టాలు తీసుకురావడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. కౌలు రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
వ్యవసాయ నష్టాలతో కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, రాష్ట్ర అసెంబ్లీలో నూతన కౌలు చట్టం ముసాయిదాను ప్రవేశపెట్టి వెంటనే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఆహార సంక్షోభం తప్పదని హెచ్చరించారు.
భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసి పంట రుణాలు, నష్టపరిహారాలు, ప్రభుత్వ పథకాలు అందించాలని కోరారు. మొంథా తుఫాను నష్టపరిహారాలను కూడా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ. రవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్. లింగరాజు, కౌలు రైతుల సంఘం జిల్లా కో-కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ధాన్యం అమ్మిన రైతులకు, కౌలు రైతులకు రవాణా కిరాయిలు, హమాలీ చార్జీలు వెంటనే చెల్లించాలని కోరారు. కృష్ణా డెల్టా పరిధిలో పంట కాలువలను ఆధునికరించాలని, అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పెసర, మినుము పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం రైతు సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు పీజీఆర్ఎస్‌లో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ ధర్నాలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, కోనా శ్రీనివాసరావు, బొడ్డు లావేటి రాంబాబు, గంటా పాపారావు, సోంబాబు సున్నా వెంకటరావు, తలారి జయరాజు, పల్లపోతు రెడ్డియ్య, బైరెడ్డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.








