తాజా వార్తలు

10/recent/ticker-posts

12 ఏళ్లుగా పరారీలో ఉన్న హత్య కేసు నిందితుడు అరెస్ట్.. ఆగిరిపల్లి పోలీసుల చాకచక్యం


ఆగిరిపల్లి. ఫిబ్రవరి, 23: ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన హత్య కేసులో దాదాపు 12 సంవత్సరాలుగా పరారీలో ఉన్న ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ నం. 20/2009, సెక్షన్ 302, 120(B) r/w 34 ఐపీసీ కింద నమోదైన ఈ కేసులో A-3 నిందితుడు అలవాల బాబ్జీ @ బాబీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


అలవాల బాబ్జీ @ బాబీ, తండ్రి నరసింహమూర్తి, గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. కేసు విచారణ సమయంలో బెయిల్‌పై విడుదలైన ఆయన 2014 సంవత్సరం నుండి కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో నూజివీడు 15వ అదనపు జిల్లా కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు.

కేసు నమోదు సమయంలో ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో ముద్దాయి ముద్దుపేర్లతో తన వివరాలు నమోదు చేయించుకొని, అనంతరం అసలు వివరాలను మారుస్తూ గుంటూరు ప్రాంతంలో దాగి జీవిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, ఆగిరిపల్లి ఎస్‌ఐ కె. శుభశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి గుంటూరు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా గుంటూరు సమీపంలోని దాసరిపాలెం గ్రామంలో అలవాల వెంకటేశ్వర్లు అనే పేరుతో నివసిస్తున్న వ్యక్తిపై అనుమానం వ్యక్తమైంది. పోలీసుల కదలికలను గమనించిన అతను అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.

పోలీసులు నిరంతర గాలింపు కొనసాగిస్తూ గుంటూరు పట్టణంలోని పాత సుజాత కాన్వెంట్, శనివారపేట ప్రాంతంలో అలవాల వెంకటేశ్వర్లు పేరుతో సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా, అతడే అలవాల బాబ్జీ @ బాబీ @ వెంకటేశ్వరరావు @ వెంకటేశ్వర్లు అని నిర్ధారించారు.

దాదాపు 12 సంవత్సరాలుగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడం పోలీసుల చాకచక్యానికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడతామని ఆగిరిపల్లి ఎస్‌ఐ శుభశేఖర్ తెలిపారు.