Hot Posts

6/recent/ticker-posts

ధాన్యం కొనుగోళ్ళలో మిల్లర్లు పూర్తి సహకారం అందించాలి: మంత్రి నాదెండ్ల మనోహర్


ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలి
ఇబ్బందులకు గురి చేసినట్లు ఫిర్యాదు వస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతాం
దళారీ వ్యవస్థను సహించేది లేదు.. ధాన్యం అన్లోడింగ్ లో మిల్లుల వద్ద కాలయాపన తగదు

కృష్ణా జిల్లా, విజయవాడ: ధాన్యం కొనుగోళ్ళలో మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గొల్లపూడి, రాయనపాడు, పైదురుపాడులలో కొనుగోలు కేంద్రాల పరిశీలన, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లాలోని రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ రైతు ఇబ్బంది పడకూడదని వారిని ఆదుకోవాలి అన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల నుండి మిల్లర్లపై అనేక ఆరోపణలు వస్తున్నాయని ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లర్ల విషయంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నప్పటికీ కొనుగోల విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయటం సహించరానిదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చెల్లించవలసిన 400 కోట్ల రూపాయల బకాయిలను మిల్లర్లకు చెల్లించామని గుర్తు చేశారు. 

తేమశాతం, నూకలు సాకు చూపి రైతులను ఇబ్బందులకు గురి చేయరాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ధాన్యం కొనుగోళ్లపై ప్రతిరోజు సమీక్షిస్తూ ఏ రైతు ఇబ్బంది పడకూడదని ఆదేశిస్తున్నారన్నారు. ఇప్పటికైనా మిల్లర్లు పద్ధతి మార్చుకొని ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలన్నారు. దళారీ వ్యవస్థను సహించేది లేదని అన్నారు. ధాన్యం అన్లోడ్ విషయంలో కాలయాపన చేయటం రైతును ఇబ్బంది పెట్టడమేనని 24 గంటల్లో మార్పు రావాలన్నారు. పంట దిగుబడి విషయంలో రైతు సంతోషంగా ఉన్నాడని, కొనుగోలు జరిగిన 24 గంటల్లో నగదు రైతు ఖాతాలకు జమ అవుతున్నప్పటికీ, మిల్లర్ల విషయంలో రైతు అసంతృప్తిని అర్థం చేసుకొని పూర్తి సహకారం అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీ శ మాట్లాడుతూ బుడమేరు వరదతో కొంత ఇబ్బంది జరిగినప్పటికీ రబీ లో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరగటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. జిల్లా యంత్రాంగం తరపున మిల్లర్లకు పూర్తి సహకారం అందిస్తున్నప్పటికీ రైతులను ఇబ్బంది పెట్టడం దురదృష్టకరమన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేసిన, దళారీ వ్యవస్థను ప్రోత్సహించిన సంబంధిత మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. వ్యవస్థలో భాగస్వామ్యులైన మిల్లర్లు ధాన్యం కొనుగోలులో రైతులకు పూర్తి సహకారం అందించి వారిలో సంతృప్తి స్థాయిని పెంచాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.

ఈ సమావేశంలో విజయవాడ ఆర్డిఓ కావూరి చైతన్య, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఎం. శ్రీనివాస్, జిల్లాలోని రైస్ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.