ఏలూరు, ఫిబ్రవరి. 24: మే నెలలో ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. కృష్ణయ్య తెలిపారు. ఏలూరులోని అన్నే భవనంలో జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రతి మూడేళ్లకు ఒకసారి నిర్వహించే రాష్ట్ర మహాసభలు ఈసారి ఏలూరులో నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసే విధంగా మహాసభలు జరగనున్నాయని పేర్కొంటూ, మహాసభల విజయానికి రైతులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందాల వల్ల దేశ వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుండి 13 రకాల పంటలు సుంకాలు లేకుండా దిగుమతి అయితే స్థానిక పంటలకు ధరలు పడిపోతాయని అన్నారు. ఇప్పటికే నష్టాల కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పలు చట్టాలు తీసుకువచ్చిందని విమర్శించారు. విత్తన చట్టం, విద్యుత్ చట్టం, డిజిటల్ అగ్రి మిషన్, వ్యవసాయ మార్కెట్ చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. రైతులు కోరుతున్న మద్దతు ధరల గ్యారెంటీ చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టి జిల్లాలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరగా పూర్తి చేయాలని, భూములు కోల్పోతున్న రైతులకు ప్రైవేట్ మార్కెట్ విలువ ఆధారంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ ధాన్యం అమ్మిన రైతులకు బకాయి ఉన్న రవాణా కిరాయిలు, హమాలీ చార్జీలు వెంటనే చెల్లించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు ఘంటా అప్పారావు, సున్నా వెంకట్రావు, లావేటి సోంబాబు తదితరులు పాల్గొన్నారు.







