![]() |
డా. బీఆర్ అంబేడ్కర్ ఆశయాల బాటలో అడుగేద్దాం..
బాబా సాహెబ్ స్ఫూర్తితో చిన్నారులు బాగా చదువుకోవాలి
అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలి
సాంఘిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
డా. బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి మహోత్సవంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
కృష్ణా జిల్లా, విజయవాడ: నవ భారత రాజ్యాంగ నిర్మాత-భారత రత్న బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ ఆశయాల బాటలో అడుగేద్దామని.. ఆయన స్ఫూర్తితో చిన్నారులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ, లెనిన్ సెంటర్, డా. బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరై అంబేడ్కర్ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, దేశాభివృద్ధికి డా. బీఆర్ అంబేడ్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాజనీతిశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం.. ఇలా ఒకటి రెండని కాదు ఎన్నో రంగాలకు చెందిన అంశాలపై లోతైన పరిశోధన చేసి, ప్రపంచ మేధావిగా గుర్తింపు సాధించిన మహనీయుడు డా. బీఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు.
భౌగోళికంగా, సాంస్కృతికంగా ఎంతో వైవిధ్యమున్న భారతదేశంలో ప్రజలందరూ మనమందరం భారతీయులం అనే ఐక్యతా భావనతో ముందుకెళ్తున్నారంటే అందుకు డా. బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ ఔన్నత్యం కారణమని వివరించారు. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు.. ఇలా ఎన్నో విశిష్టతలకు నెలవు భారత రాజ్యాంగమని పేర్కొన్నారు.
సమాజానికి సుసంపన్న వనరులుగా ఎదగాలి:
సామాజిక అసమానతలను విద్యతో రూపుమాపవచ్చని.. డా. బీఆర్ అంబేడ్కర్ చేసిన మంచి ఆలోచనలు, ఆశయాల బాటలో యువత నడుస్తూ రాష్ట్రం, దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని, సమాజానికి సుసంపన్న వనరులుగా ఎదగాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. డా. బీఆర్ అంబేడ్కర్‌తో అనుబంధం, సంబంధమున్న ప్రాంతాలను పంచతీర్థగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
జన్మభూమి, శిక్షాభూమి, దీక్షాభూమి, చైత్యభూమి, పరినిర్వాణ భూమి ప్రాంతాలను చారిత్రక, సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు ఎస్‌సీ గురుకులాల ద్వారా నాణ్యమైన ఉచిత విద్యను, ప్రాజెక్ట్ సంకల్ప్ ద్వారా ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు జేఈఈ, ఐఐటీ, సివిల్స్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లతో పాటు వివిధ ఆర్థిక సహాయ పథకాలను అమలుచేస్తున్నట్లు వెల్లడించారు. పీఎం సూర్యఘర్ అనుసంధానంతో ఎస్‌సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శాలను జీవనశైలిలో భాగంగా చేసుకుంటూ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ తదితర అంశాల్లో వసతి గృహ విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు కలెక్టర్ లక్ష్మీశ ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేసి, అభినందనలు తెలిపారు. అదేవిధంగా వివిధ పోటీల్లో విజేతలైన ఎస్ఆర్‌కే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులకు కూడా బహుమతుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రజాగాయకులు పాడిన పాటలు అలరించాయి. బాబా సాహెబ్ జీవిత ఔన్నత్యాన్ని చాటిచెప్పాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాస శిరోమణి, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డీఏవో డీఎంఎఫ్ విజయకుమారి, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఎంఐపీ పీడీ పి.ఎం.సుభానీ, డీఎస్‌వో పాపారావు, డీపీవో పి.లావణ్య కుమారి, దళిత సంక్షేమ సంఘాల నేతలు పి.యేసురత్నం, వి.నాగేశ్వరరావు, బి.రాజు, విజయ్ కుమార్, యు.తారక ప్రసాద్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్, బర్డ్స్ ఎన్‌జీవో సెక్రటరీ కె.ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.