Hot Posts

6/recent/ticker-posts

సీతారాముల కళ్యాణం...ఊరురా వైభోగం


*అంతా రామమయం.. జగమంతా రామమయం
*రాష్ట్ర ప్రజలకు అయోధ్యుని ఆశీస్సులు మెండుగా ఉండాలి 

డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం, బ్యూరో: శ్రీరామనవమి వేడుకలు ఆదివారం రామచంద్రపురం నియోజవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం నియోజవర్గంలోని పలు దేవాలయాలు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అత్యంత భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ నినాదంతో రాష్ట్ర ప్రజల సుఖశాంతులు కోరుతూ పూజలు నిర్వహించారు. అంతా రామమయం..జగమంతా రామమయం అనే భక్తి పారవశ్యంతో రామాలయాలకు విచ్చేసిన భక్తులను చిరునవ్వుతో పలకరిస్తూ దేవాలయాలు దర్శించుకున్నారు. ఉదయం నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. ప్రతి ఆలయంలోనూ సీతారామ కళ్యాణాలు కమనీయంగా నిర్వహించారు. ఈ కళ్యాణ ఘట్టాన్ని భక్తులు తిలకించి తరించారు. శ్రీరామ నామ జపంతో అంతా రామమయంగా మారింది. 

ముఖ్యంగా రామచంద్రపురం, సత్యవాడ వెలంపాలెం పాతకోట గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పాల్గొన్న మంత్రి సుభాష్ సమక్షంలో వేద పండితుల మంత్రోచారణలు మంగళ వాయిద్యాలు నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు కమనీయంగా, కనుల పండుగగా జరిగాయి. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు ప్రసాదాలు సమర్పించారు. భక్తులకు బెల్లం పానకాలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. 

ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం ఆయా గ్రామాల కూటమి నాయకులు సర్పంచులు గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now