Hot Posts

6/recent/ticker-posts

అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి


VISAKHAPATNAM: అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఉన్న ఓ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఒక్కసారిగా భారీ పేలుడు, మంటలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది. పేలుడు దెబ్బకు భవనం కుప్పకూలింది. ప్రమాదం గురించి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.. మరోవైపు నెల్లూరు జిల్లాలో శనివారం గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.


మరోవైపు ప్రమాదంలో చనిపోయిన వారు సామర్లకోటకు చెందిన వారిగా తెలిసింది. కూలీ పని కోసం వచ్చి వీరంతా మృత్యువాత పడ్డారు. మరోవైపు పేలుడు ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది. బాధితుల ఆర్తనాదాలు, చనిపోయిన వారి బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. పేలుడుకు కారణాలు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది.. మంటలను ఆర్పివేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పేలుడుకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

బాణాసంచా తయారీ కేంద్రం కావటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మృతుల సంఖ్య పెరుగుతోంది. భారీ పేలుడుతో ఘటనా స్థలిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాణాసంచా కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన కార్మికులను విశాఖపట్నం కేజీహెచ్‍కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఘటనాస్థలికి చేరుకున్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న వంగలపూడి అనిత అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాకు బయల్దేరి వెళ్లారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలిని అనకాపల్లి కలెక్టర్‌ పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయన.. ఘటనపై విచారణకు ఆదేశించారు.

మరోవైపు ప్రమాద సమయంలో పరిశ్రమలో 15మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు హోం మంత్రి, అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now