Hot Posts

6/recent/ticker-posts

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ 30 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక..


ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్‌లో వేసవి తన ప్రతాపాన్ని చూపుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 42 డిగ్రీల సెల్సియస్‌ను దాటేశాయి. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


నిన్న, శనివారం పల్నాడు జిల్లాలోని రావిపాడులో అత్యధికంగా 43.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాకుండా.. రాష్ట్రంలోని 119 ప్రాంతాల్లో 41 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శనివారం 14 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయని.. మరో 68 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఈరోజు ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 మండలాల్లో తీవ్రమైన వడగాలులు.. మరో 67 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాలు, విజయనగరం జిల్లాలో 11 మండలాలు, మన్యం జిల్లాలో 10 మండలాలు, ఏలూరు జిల్లాలో 1 మండలం మరియు ఎన్టీఆర్ జిల్లాలోని 1 మండలంలో తీవ్రమైన వడగాలులు వీచే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.

ప్రజలు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నీరు, నిమ్మరసం, మజ్జిగ, గ్లూకోజ్ లేదా ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు , దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది.
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now