ANDRAPRADESH, VIJAYAWADA: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మానసపుత్రిక ఏపీ ఫైబర్ నెట్ మనుగడపై అనుమానాలు తలెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ఫైబర్ నెట్ కార్యకాలాపాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రజలకు చౌక ధరకే ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ స్థాపించారు. 2015లో ప్రారంభమైన ఈ సంస్థ 2019 వరకు మంచి పురోగతి సాధించిందని చెబుతుంటారు.
అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ తీరే మారిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దివాళాకు దగ్గరలో ఉన్న ఫైబర్ నెట్ కార్పొరేషన్ ను తిరిగి పునరుజ్జీవం తేవడానికి సర్కారు ప్రయత్నిస్తోంది. దీంతో గత ప్రభుత్వంలో ఎడాపెడా నియమించిన ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో 500 మంది ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితమే 248 మంది సిబ్బందిని తొలగించిన ప్రభుత్వం తాజాగా మరో 500 మందిపై వేటు వేసింది.
వీరంతా విధులకు రాకున్నా, నెలనెలా జీతాలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వీరంతా కడప, పులివెందుల ప్రాంతాలకు చెందిన వైసీపీ కార్యకర్తలేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాట్సాప్ సందేశాల ద్వారా వీరి నియామకాలు జరిగినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. గత ఏడాది జూన్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అవకతవకలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అంతకుముందు ఐదేళ్లు చోటుచేసుకున్న అంశాలపై విజిలెన్స్ విచారణ చేపట్టింది.
2019-24 మధ్య రూ.5,400 కోట్ల లావాదేవీలు జరగ్గా, రూ.500 కోట్లు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ ప్రాథమికంగా నివేదిక సమర్పించింది. ఇదే సమయంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డిని నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫైబర్ నెట్ లో ఉద్యోగాల స్కాం వెలుగుచూసింది. దీంతో అప్పట్లోనే మొత్తం ఉద్యోగులను తొలగించాలని చైర్మన్ హోదాలో జీవీ రెడ్డి ఆదేశించారు.
అయితే ఆయన ఆదేశాల అమలుకు కాస్త టైం తీసుకోవడంతో అప్పటి ఎండీపై జీవీ రెడ్డి విమర్శలు గుప్పించారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించారని చైర్మన్, ఎండీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక జీవీ రెడ్డి నిష్క్రమణ, ఎండీకి ఉద్వాసన చెప్పిన తర్వాత ప్రభుత్వం ఫైబర్ నెట్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం అక్రమాలు అన్నీ రుజువు కావడంతో ఉద్యోగులపై వేటు వేయడం మొదలుపెట్టింది.
రెండు రోజుల క్రితం 248 మంది, తాజాగా మరో 500 మంది ఉద్యోగులపై వేటు వేయడంతో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ దాదాపు ఖాళీ అయిందని అంటున్నారు. మరోవైపు వైజాగ్ ఆపరేషన్ సెంటర్ లో టెక్నికల్ సిబ్బందిని తొలగించడంతో ఫైబర్ నెట్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోందని అంటున్నారు. ఫైబర్ నెట్ కనెక్షన్లు తీసుకున్న వారికి ప్రస్తుతం ఇంటర్నెట్ సౌకర్యం లభించడం లేదని చెబుతున్నారు.
దీంతో ఫైబర్ నెట్ మనుగడపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ సాంకేతిక సిబ్బందిని నియమించేవరకు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా ఇంటర్నెట్ సేవలు సందేహస్పదమేనంటున్నారు.