Hot Posts

6/recent/ticker-posts

హైదరాబాద్ లోనే ఏపీ పోలీసులు.. కసిరెడ్డి కోసం ముమ్మర వేట!


ANDRAPRADESH, TELANGANA: ఏపీ లిక్కర్ స్కాంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోనే తిష్ఠ వేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న వైసీపీ నేత, ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజ్ కసిరెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తున్న ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాలు, ఫాం హౌజ్ ల్లోనూ గాలిస్తున్నారు. అయితే పోలీసులు ఎక్కడికి వెళ్లినా ‘తెలియదు’ అన్న ఏకైక సమాధానమే లభిస్తోందంటున్నారు. 


ఏపీ లిక్కర్ స్కాం చిక్కుముడి వీడే పరిస్థితి లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు అనుమానితులను అరెస్టు చేయకపోవడం, అనుమానితులుగా భావిస్తున్న వారు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడంతో కేసు విచారణ ప్రత్యేక దర్యాప్తు బృందానికి సవాల్ గా మారింది. దాదాపు రూ.3 వేల కోట్ల కుంభకోణంగా అనుమానిస్తున్న ఈ వ్యవహారంలో ఎలాంటి పురోగతి లేదని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కేసులో ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి పరార్ తో సిట్ అధికారులు అక్కడే ఆగిపోయినట్లు చెబుతున్నారు. 

అయితే విచారణకు రమ్మంటూ మూడు సార్లు నోటీసులిచ్చినా, లెక్క చేయని రాజ్ కసిరెడ్డి హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం చర్చనీయాంశమవుతోంది. సిట్ నుంచి తప్పించుకోడానికి ఏపీకి చెందిన పోలీసు అధికారులే ఆయనకు సహరిస్తున్నారని పత్రికల్లో వస్తున్న వార్తలు మరింత అగ్గి రాజేస్తున్నాయి. దీంతో పోలీసులు తమ విచారణను అటువైపు మళ్లించినట్లు చెబుతున్నారు. 

గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసి, ప్రస్తుతం వీఆర్ లేదా సస్పెన్షన్ లో ఉన్న కొందరు అధికారులపై నిఘా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. వారి నుంచే కసిరెడ్డికి సలహాలు, సూచనలు వెళుతున్నాయని, ఆ లింకు కనుగుంటే కసిరెడ్డి దొరికిపోయినట్లేనని సిట్ అధికారులు భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ ఐపీఎస్ అధికారులపై ఓ లుక్కు వేసి ఉంచినట్లు చెబుతున్నారు. 

ఇక కసిరెడ్డి కోసం గాలిస్తున్న సిట్ పోలీసులు ఆయన తల్లిదండ్రులు ఉపేంద్రరెడ్డి ఇంటికి వెళ్లి ఆరా తీశారు. కసిరెడ్డి ఆచూకీ తనకు తెలియదని తండ్రి ఉపేందర్ రెడ్డి చెప్పడంతో కంగుతిన్నారు. దీంతో విజయవాడ రమ్మంటూ ఉపేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు కసిరెడ్డికి చెందిన రూ.1.33 కోట్ల విలాసవంతమైన కారును హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. అదేవిధంగా కసిరెడ్డి భార్య దివ్యారెడ్డి, ఆమె బంధువు తీగల విజయేందర్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న ఆరేటి ఆస్పత్రిలోనూ తనిఖీలు నిర్వహించి కొన్ని పత్రాలు సీజ్ చేశారని అంటున్నారు.