ఏలూరు/నూజివీడు: ఒకప్పుడు నూజివీడు నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లాలంటే అక్కడి ప్రజలు ఎంతో శ్రమకోర్చేవారు. ప్రయాణ సమయానికి సరైన వాహనాలు లేకపోవడం, ఆర్టీసీ బస్సులలో ప్రయాణీకుల రద్దీ, తదితర కారణాలతో నూజివీడు నుండి బస్సు ప్రయాణమంటే ప్రజలకు అదో బాధా ప్రయాణం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి కి వెళ్లేందుకు నూజివీడు సరైన రవాణా సౌకర్యం లేదు. అదేవిధంగా హైదరాబాద్, బెంగుళూరు, వంటి ఇతర ప్రాంతాలలో ఉద్యోగం చేస్తున్న నూజివీడు యువతకు తమ ప్రాంతానికి రాకపోకల సాగించేందుకు సరైన బస్సు సర్వీసులు లేక చాలా ఇబ్బందులు పడుతుండేవారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నూజివీడు శాసనసభ్యులు, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో భాగంగా ఆర్టీసీ బస్సులలో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం సాగేందుకు పలు మార్గాలలో బస్సు సర్వీసులు పెంచడమే కాక, ప్రయాణీకులకు 19 కొత్త బస్సులను అందుబాటులోనికి తీసుకువచ్చి, ప్రజలకు సుఖవంతమైన ప్రయాణాన్ని సులభతరం చేశారు.
మంత్రి పార్థసారథి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రితో మాట్లాడి విజయవాడ మీదగా తిరుమల తిరుపతి వరకు 2 కొత్త సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ లు, ప్రాముఖ్య పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకం వెళ్లేందుకు యర్రగొండపాలెం వరకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్, బెంగుళూరుకు 2 సూపర్ లగ్జరీ బస్ సర్వీసులు , విశాఖపట్నం సూపర్ లగ్జరీ బస్ సర్వీసు, హైదరాబాద్ 11 సూపర్ లగ్జరీ సర్వీసులు, విజయవాడ నాన్ స్టాఫ్ బస్సు సర్వీసులు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకున్నారు.
అంతేకాక మరిన్ని కొత్త బస్సులు ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మంత్రి చర్యలు తీసుకుంటున్నారు. కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడమే కాక ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో మరిన్ని బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడంతో నూజివీడు ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కుంటున్న రవాణా సమస్యకు కొన్ని నెలల్లోనే పరిష్కారం చూపిన మంత్రి పార్థసారథికి నూజివీడు ప్రాంత ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు తమ హర్షాన్ని తెలియజేస్తూ మంత్రి పార్థసారథికి కృతఙ్ఞతలు తెలుపుతున్నారు.