*మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం
*సర్వ మానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్ధనల ముఖ్యోద్దేశ్యం
*ఉపవాస దీక్ష ద్వారా మానసిక, శారీరక పవిత్రత
*ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా, ఏలూరు: సర్వ మానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్ధనల ముఖ్యోద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. స్థానిక గిరిజన భవన్ లో మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జరిగిన 'ఇఫ్తార్' కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష ద్వారా మానసిక, శారీరక పవిత్రత చేకూరుతుందన్నారు.
రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ఓర్పు, సహనం, ప్రతీ ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయన్నారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాదని , వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష చేసిన చిన్నారులతో, ముస్లిం మత పెద్దలతో కలిసి 'ఇఫ్తార్' విందులో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, డిఆర్డిఏ పీడీ కె. విజయరాజు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎన్ .ఎస్. కృపావరం, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, జిల్లా బి.సి సంక్షేమాధికారి నాగరాణి, బిసి కార్పొరేషన్ ఈడీ పుష్పలత, ఎస్.సి., కార్పొరేషన్ ఈడీ ముక్కంటి, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ పి. నాగార్జునరావు, వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ భాషా, సెట్ వెల్ మేనేజర్ ప్రభాకర్, ముస్లిం మతపెద్దలు, ప్రభృతులు పాల్గొన్నారు.