గతానికి భిన్నంగా ఈసారి మే నెలలోనే భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. మంచి ఎండాకాలంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా అనేక ప్రాంతాలలో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం కంటే ముందే ఈసారి నైరుతి రుతుపవనాలు చురుగ్గా వ్యాపిస్తున్నాయి అని, వర్షాలు కూడా ముందే కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది.
రేపు అల్పపీడనంగా మారనున్న ఉపరితల ద్రోణి
రెండు రోజుల క్రితం అండమాన్ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు, మే 31వ తేదీన కేరళ తీరాన్ని, జూన్ మొదటి వారం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి రేపటిలోగా అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది ఆ తర్వాత వాయుగుండంగా బలపడుతుందని, దీని ప్రభావంతో ఏపీలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి అని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇలా జరిగితే ఏపీకి తుఫాను ముప్పు తప్పినట్టే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ అది బలపడిన తర్వాత ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే ఏపీకి తుఫాను ముప్పు తప్పినట్లే అని అంటున్నారు.
రానున్న 5 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఇదిలా ఉంటే ఉపరితల ద్రోణి కారణంగా దక్షిణాది రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే ఐదు రోజులు కోస్తా ఆంధ్ర, యానం, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతేకాదు తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్, కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నివేదికలో పేర్కొంది.
నేడు ఈ జిల్లాలలో వర్షాలు
ఇదిలా ఉంటే ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని,అలాగే రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
నిన్న ఈ జిల్లాలలో కురిసిన వానలు
అంతేకాదు సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీసత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలంలో 42.5మిమీ, చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో 38.2మిమీ, కోనసీమ మండపేట, విజయనగరం కొత్తవలసలో 30.5మిమీ, చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. దాదాపు 30 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు తెలిపారు.