కామవరపుకోట: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు తనిఖి చేశారు.
సరుకు నిల్వ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చెయ్యాలని సూచించారు. వంటశాలను చేరుకుని అక్కడి వసతులను, వంటకాలను పరిశీలించారు. పరిశుభ్రతను పాటించాలని సిబ్బందికి సూచించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సదుపాయాలను పరిశీలించారు. నీటి శుద్ధి యంత్రం పని తీరు అడిగి తెలుసుకున్నారు. భోజన వితరణ జరిగే వరకు అక్కడే ఉండి విధానాన్ని గమనించారు.
విద్యార్థులతో విడివిడిగా ముచ్చటించి పథకం అమలు తీరు, ఆహార నాణ్యత, రుచి, మెనూ అమలు, నీటి లభ్యత, పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే వారు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారని, చదువులో రాణిస్తారనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకుని ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని, అమలులో ఎటువంటి ఇబ్బందులు ఉన్న వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు విజయకృష్ణ సూచించారు. విద్యార్దులు తమకున్న ఇబ్బందులు తెలిపారని, అన్ని వివరాలతో నివేదికను జిల్లా కలెక్టర్ కి అందజేస్తానని ఆయన తెలిపారు.