జంగారెడ్డిగూడెం: పట్టణ ఇలవేల్పు దేవత, ఉత్తరాన కొలువైయున్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యసన్నిధిలో ఆలయకమిటీ నిర్వహణలో ప్రతీ నెలా పౌర్ణమి రోజు సాయంత్రం జరుగుతున్న చండీహోమంలో భాగంగా 72వ చండీహోమం మాఘపౌర్ణమిని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా, వేదోక్తంగా జరిగింది.
అమ్మ వారి ఆలయ యాగశాలలో జరిగిన 72వ చండీ హోమంలో నామ ఉమామహేశ్వరరావు, పద్మావతి అలివేలు మంగమ్మ దేవీ కుమారి దంపతులు, రావి రాఘవ కుమార్, భవాని దంపతులు, పామర్తి వెంకట పద్మావతి దంపతులు, పారేపల్లి మణికుమార్, నవ్యశ్రీ దంపతులు మరియు ముల్లంగి ప్రసాదరెడ్డి, సంధ్య కుటుంబ సభ్యులు ఉభయదారులుగా పాల్గొన్నారు.
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కె.ఎల్.ఎన్. ధనకుమార్ మాట్లాడుతూ.. మాఘ మాసంలో వచ్చేపౌర్ణమిని మాఘ పూర్ణిమ మహా మాఘే అంటారన్నారు. ఈ రోజు చేసే పూజాధికలకు కోటిరెట్లు ఫలితం ఉంటుందని చెప్పారు. కనుక ప్రతిఒక్కరూ మంచి పనులతో పాటు హోమాది పూజలు చేయడం వలన తెలిసీ తెలియకుండా చేసిన పాపాలు నశించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మరియు సకల శుభాలు కలుగుతాయని అన్నారు.
చండీహోమం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి న్యాయ బద్ధమైన ధర్మ సమ్మతమైన కోరికలు తీరుతాయని అన్నారు. అగ్నిముఖతా హవిస్సులు సమర్పణ జరిపే క్రమంలో మరింత శుభఫలితాలు లభిస్తాయని తెలిపారు. రాజాన సత్యనారాయణతో కూడిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.
ఆలయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ రాజాన మాట్లాడుతూ, అమ్మ వారి అఖండమైన అనుగ్రహంతో నేటికి 72 చండీ హోమాలు పూర్తి చేశామని తెలిపారు. ఉభయదరులకు అమ్మ వారి శేష వస్త్రాలు, రూపక పటాలు యిచ్చి మరియు అమ్మ వారి ప్రసాదాలు అందజేశామన్నారు.
వేద పండితులచే వేద ఆశీర్వాదాలు చేసి, అమ్మ వారికి ఏకాదశ హారతి పూజలు, వేదదర్బారు సేవ చతుర్వేద స్వస్తి నీరాజన మహామంత్ర పుష్పం ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు సమర్పించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని భక్తులకు యే విధమైన ఇబ్బందీ కలగకుండా చూచి ప్రసాద వితరణ చేసి, కార్యక్రమాలను విజయవంతం చేశారు.