Hot Posts

6/recent/ticker-posts

చిత్రకూట్ లో కమనీయంగా తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం.. మహా కుంభమేళా స్పెషల్!


జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు మహా కుంభమేళా జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల పైన కొలువైన దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహా కుంభమేళాలోనూ భక్తులను కరుణిస్తున్నారు. మహా కుంభమేళా సందర్భంగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం ఎంతో వైభవంగా నిన్న నిర్వహించారు. 


చిత్ర కూట్ లో శ్రీనివాస కళ్యాణం.. 
మహా కుంభమేళా సందర్భంగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ లో శ్రీ శ్రీనివాస కళ్యాణం నేడు ఘనంగా జరిగింది. త్రేతా యుగంలో రాములవారు సీతాదేవి, లక్ష్మణులతో కలిసి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన పవిత్రస్థలమైన మధ్య ప్రదేశ్ లో చిత్రకూట్ నగరంలో నేడు ఈ కమనీయ కళ్యాణ ఘట్టం జరిగింది. ఉత్తరాది అహోబిల మఠంలో నేడు ఉదయం శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది.

స్వామి కళ్యాణం ఎలా జరిగిందంటే.. 
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం నేడు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులను కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారి కళ్యాణం జరిపించారు. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం గావించారు. 

శ్రీనివాస కళ్యాణం తిలకించి పరవశించిన కుంభమేళాకు వచ్చిన భక్తులు.. 
మాంగల్య పూజ, మంగళసూత్ర ధారణ మొదలైన ఘట్టాలతో స్వామివారికి శాస్త్రోక్తంగా అమ్మవార్లతో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళ హారతి సమర్పించడంతో కళ్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు అమ్మవారి కళ్యాణ ఘట్టాన్ని అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నేత్రపర్వంగా తిలకించి భక్తి పరవశంతో పులకించిపోయారు.

మహా కుంభమేళా భక్తులకు ఆనందం కలిగిస్తున్న శ్రీనివాస కళ్యాణం.. 
ఈ కార్యక్రమాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే నిర్వహిస్తారో అదే విధంగా నిర్వహించడానికి శ్రీవారి ఆలయ ప్రధానఅర్చకుడు గోపీనాథ్ దీక్షితులతో పాటు పలువురు ఆలయ అధికారులు విశేషంగా కృషిచేశారు. కాగా మహా కుంభమేళాలో భాగంగా మొన్న ప్రయాగరాజ్‌లో స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగితే తాజాగా మధ్య ప్రదేశ్ లోని చిత్ర కూట్ లో ఘనంగా కళ్యాణం జరిగింది.