A P State,Amaravati: ఏపీలో అమరావతి రాజధానికి మరో గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే ఐదేళ్లుగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ప్రపంచ బ్యాంక్ తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు, మరికొన్ని ఆర్ధిక సంస్థలు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో అందులో కీలకమైన హడ్కో ఇవాళ అమరావతి రాజధానికి రుణంపై కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు రుణం విడుదలకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవపల్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (హడ్కో) ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై లో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు అనుమతి లభించింది. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11 వేల కోట్లు రుణం కోసం సంప్రదింపులు జరిపామని, హడ్కో తాజా నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంక్ కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించాయి. రాజధానిలో పర్యటించిన ఆయా బ్యాంకుల ప్రతినిధులు స్దానికంగా ఉన్న పరిస్దితుల్ని, నిర్మాణం వల్ల కలిగే లాభాన్ని అంచనా వేసుకుని రుణాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. దీంతో మిగతా ఆర్ధిక సంస్ధలు కూడా ఇప్పుడు రాజధాని అమరావతికి క్యూ కడుతున్నాయి. మరోవైపు త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాజదాని నిర్మాణం పునఃప్రారంభించేందుకు కూటమి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.