Hot Posts

6/recent/ticker-posts

దుద్దిళ్ళ శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం: సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా


 
Telangana, Singareni: శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో సింగరేణి అధికారి లలిత్ కుమార్ అనిత దంపతుల ఆధ్వర్యంలో దివంగత నేత ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతి వేడుకలు పిల్లలకు సహపంక్తి భోజనాలు ఘనంగా నిర్వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ దివంగత నేత మంథని శాసనసభ్యులు తెలంగాణ ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు తండ్రి స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతి వేడుకలు శనివారం నాడు మణుగూరు మండలం సంతోష్ నగర్ లోని శ్రీ విద్యాభ్యాస (బాల వెలుగు) పాఠశాలలో జిఎం కార్పొరేట్ డి లలిత్ కుమార్ ప్రముఖ పాత్రికేయురాలు సామాజిక కార్యకర్త అనిత దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు స్వర్గీయ శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి సభ్యులు సయ్యద్ నా సర్ పాషా మాట్లాడుతూ రాజకీయాలలో ప్రారంభోత్సవాలు చేసిన నాయకుల పేర్లు శిలాఫలకాలపై లిఖించబడతాయని, కానీ ప్రజలలో మమేకమై ప్రజల అభివృద్దే తమ అభివృద్ధిగా భావించి ప్రజలకు సేవ చేసిన నాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అనటానికి దుద్దిళ్ళ శ్రీపాదరావు ఒక గీటురాయి అని అన్నారు.

ఆనాటి శ్రీపాదరావు కాలం నుండి మంత్రి నేటి శ్రీధర్ బాబు వరకు మంథని శాసనసభ్యులుగా అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్న దుద్దిళ్ళ వారి కుటుంబ సభ్యులనే తమ నేతలుగా ప్రజలు ఎన్నుకుంటున్నారు అంటే ప్రజలలో శ్రీపాదరావు ఎంతటి ప్రభావం కలిగిన నేతనో మనకు అర్థం అవుతుందని అన్నారు. నేటి రాజకీయ నాయకులకు ఆయన స్ఫూర్తిదాయకం కావాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీపాద రావు సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. 

మార్చి 2 శ్రీపాద రావు జయంతి వేడుకలు అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సముచిత నిర్ణయంగా సయ్యద్ నా సర్ పాషా అభివర్ణించారు. అనంతరం చిన్నారులకు సహపంక్తి భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, పాఠశాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్న లలిత్ కుమార్ అనిత దంపతులకు వారి మిత్ర బృందానికి విద్యార్థిని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో శ్రీ విద్యాభ్యాస పాఠశాల కరస్పాండెంట్ బి జగన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు సుహాసిని దేవి, కళావతి, స్వాతి, రాధ తదితరులు పాల్గొన్నారు.