Hot Posts

6/recent/ticker-posts

వైఎస్ షర్మిల భద్రత పెంపు ..! డీజీపీ ఆదేశాలతో..


ఏపీ రాజకీయాల్లోకి ఈ మధ్యే పీసీసీ ఛీఫ్ గా ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జగనన్నా, జగనన్నా అంటూనే సీఎం జగన్ ను టార్గెట్ చేసేస్తున్నారు. దీంతో వైసీపీ అభిమానులు ఇప్పటికే ఆమెను సోషల్ మీడియాలో తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. అలాగే బయట కూడా షర్మిలపై దాడులకు దిగే ప్రమాదం ఉందన్న సంకేతాలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఆడబిడ్డకు భద్రత కల్పించలేరా అంటూ షర్మిల ప్రశ్నించారు.


ఈ నేపథ్యంలో భద్రత పెంపు కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు ప్రభుత్వ వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె అధికారికంగా కోరడంతో వైఎస్సార్ జిల్లా పోలీసులు ఆమెకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ ఓ ప్రకటన విడుదల చేశారు. వై.ఎస్ షర్మిల అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ నుండి టూ ప్లస్ టూ గా భద్రత పెంచామని తెలిపారు.


షర్మిల అభ్యర్ధన నేపథ్యంలో డీజీపీ ఆదేశాలతో భద్రత పెంచినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. భద్రతా ప్రమాణాల నిబంధనల మేరకు ఇలా పెంచినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం వారు ఇచ్చే సిఫారసు(సెక్యూరిటీ రివ్యూ కమిటీ) నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయిస్తామని ఎస్పీ ప్రకటనలో వెల్లడించారు. వైఎస్ షర్మిలకు ఇతర జిల్లాల్లో పరిస్ధితి ఎలా ఉన్నా వైఎస్సార్ జిల్లాలో పరిస్ధితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అన్న అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ సర్కార్ పై తాను చేస్తున్న విమర్శలతో పార్టీ క్యాడర్ ఆగ్రహంగా ఉంది. దీంతో షర్మిలపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఇది సున్నిత వ్యవహారంగా మారుతుందన్న ఉద్దేశంతో పోలీసులు భద్రత పెంచినట్లు తెలుస్తోంది.