Hot Posts

6/recent/ticker-posts

కోడి కత్తి శ్రీనుకు హైకోర్టు బెయిల్


ఏపీలో గత ఎన్నికల సమయంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న కోడి కత్తి దాడికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పై కోడి కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జనిపల్లి శ్రీనివాస్ కు హైకోర్టులో ఐదేళ్ల తర్వాత ఊరట లభించింది. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ జనిపల్లి శ్రీనివాస్ చేసిన దాడిపై కోర్టుకు నివేదిక సమర్పించింది. దీనిని పరిశీలించిన కోర్టు.. అతనికి షరతులకో కూడిన బెయిల్ ఇచ్చింది. 2019లో సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు పాదయాత్రలో పాల్గొని తిరిగి వెళ్లేందుకు వైజాగ్ ఎయిర్ పోర్టుకు వచ్చిన వైఎస్ జగన్ పై అక్కడే ఓ రెస్టారెంట్ లో పనిచేస్తున్న జనిపల్లి శ్రీనివాస్ కోడి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. దీనికి ప్రాథమిక చికిత్స తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయిన జగన్.. అనంతరం కోలుకున్నారు. కానీ జనిపల్లి శ్రీనివాస్ మాత్రం ఈ కేసులో ఇరుక్కుపోయారు.


ఈ కేసును ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. అనంతరం దాఖలు చేసిన ఛార్జిషీట్ లో వైఎస్ జగన్ పై జనిపల్లి శ్రీనివాస్ కోడి కత్తితో చేసిన దాడి వెనుక ఎలాంటి కుట్రా లేదని తేల్చింది. జగన్ కు మైలేజ్ ఇచ్చేందుకే వైసీపీ అభిమాని అయిన శ్రీనివాస్ ఈ దాడికి పాల్పడినట్లు తేల్చింది. దీంతో విజయవాడ ఎన్ఐఏ కోర్టు తీర్పు చెప్పేందుకు సిద్ధమైంది. అదే సమయంలో ఎన్ఐఏ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్.. సమగ్ర విచారణ చేయించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇలా ఐదేళ్ల పాటు సాగిన విచారణల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసినా కోర్టులు మాత్రం అంగీకరించలేదు. దీంతో తొలుత రాజమండ్రి జైల్లో, అనంతరం విశాఖ జైల్లో శ్రీనివాస్ మగ్గుతున్నాడు. తాజాగా తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ జైల్లో నిరాహారదీక్ష కూడా చేశాడు. అదే సమయంలో అతని కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో నిరాహారదీక్ష చేశారు. ఈ దీక్షల్ని పోలీసులు భగ్నం చేశారు. చివరికి హైకోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కేసుపై ఎక్కడా మాట్లాడొద్దని హైకోర్టు షరతు పెట్టింది.