ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న భీమవరం నియోజకవర్గంలో ప్రస్తుతం రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి విజయం సాధిస్తే, రాష్ట్రంలో అదే పార్టీ విజయం సాధిస్తుందని ఇక్కడి నానుడి. ఈ క్రమంలో ఆసక్తికరమైన రాజకీయాలకు కేరాఫ్ గా మారిన భీమవరం రాజకీయం మీకోసం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వాణిజ్య, రాజకీయ రాజధానిగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలన్నీ భీమవరం నియోజకవర్గం లో ఉన్న కాపులు, రాజులు సామాజిక వర్గాలే శాసిస్తాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
పవన్ కళ్యాణ్ పై 2019 ఎన్నికలలో వైసిపి అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. గ్రంధి శ్రీనివాస్ కు 70 వేల 642 ఓట్లు పోల్ కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 62వేల 285ఓట్లు పోలయ్యాయి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన పులపర్తి రామాంజనేయులుకు 54వేల 37ఓట్లు పోలయ్యాయి. కేవలం 8,357 ఓట్లతో వైసిపి అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ విజయ సాధించారు.
గతంలో జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల టిడిపి, జనసేన మధ్య ఓట్ల చీలిక గ్రంధి శ్రీనివాస్ కు విజయం దక్కేలా చేసింది. అయితే ఈసారి టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఉమ్మడిగా బరిలోకి దిగుతున్న వేళ భీమవరం నుండి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతారని తెలుస్తోంది. దీంతో ఈసారి పవన్ కళ్యాణ్ విజయం తధ్యం అని భావిస్తున్నారు జనసైనికులు. ఈ క్రమంలో జనసేన నాయకులు భీమవరం నియోజకవర్గంలో జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పొత్తులలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈసారి పొత్తులతో పోటీకి వెళుతున్న పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారని వారు ధీమాతో ఉన్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో వైసిపి పథకాలను బలంగా క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే శ్రీనివాస్ ని రియల్ హీరోగా పేర్కొనడం కూడా ప్రజల్లో మంచి స్పందనకు కారణమైంది. వ్యక్తిగతంగా కూడా ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెరపడం గ్రంధి గెలుపుకు ఉపయోగపడుతుందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
భీమవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గెలుపు ఆపడం ఎవరికీ సాధ్యం కాదని వైసీపీ క్యాడర్ గట్టిగా విశ్వసిస్తోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రజలకు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో నియోజకర్గం వ్యాప్తంగా ప్రజల్లో ఎమ్మెల్యేపై అభిమానం ఉంది. ఆపదలో వెన్నంటి ఉన్న లీడర్ గంధి శ్రీనివాస్ అని క్యాడర్ ప్రచారం చేస్తోంది. మొత్తంగా ఎవరికి వారు విజయావకాశాలపై బోలెడు అంచనాలతో ఉన్నారు.