కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డిలతో బీజేపీ నేత ఈటల రాజేందర్ విందు భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంత రావు, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో బీజేపీ నేత, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఒక చోట కలిసి ముగ్గురు నేతలు చర్చించుకున్నారు. కాంగ్రెస్ నేతలతో ఈటల రాజేందర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
గత కొద్దీ రోజులుగా ఈటల రాజేందర్ బీజేపీ హైకమాండ్ మీద అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన టిక్కెట్ అడుగుతున్నారు. కానీ హైకమాండ్ ఏదీ తేల్చడం లేదు. ఈటల రాజేందర్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా మల్కాజ్‌గిరిలో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ కార్యక్రమాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అధిష్టానానికి సంకేతాన్ని పంపుతున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఈటల ఫర్ మల్కాజ్‌గిరి’ క్రికెట్ ట్రోఫీని ఆయన అనుచరులు స్టార్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కూడా స్వయంగా తన నివాసంలో ఈటల రాజేందర్ రిలీజ్ చేశారు. ఈటలకే మల్కాజ్‌గిరి టికెట్ రాబోతున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో మరోసారి ఈటల దుమారం తెరపైకి వచ్చింది.
ఎంపీగా పోటీపై బీజేపీ అధిష్టానం నిర్ణయం కంటే ముందే అనుచరుల పేరుతో తానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.ఈ అంశంపై పార్టీ నేతలు హైకమండ్ కు పిర్యాదులు చేశారు. ఇప్పటికి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినా పార్టీ పరిస్థితి మెరుగుపడలేదు. ఈటల సూచనల మేరకే బీసీ సీఎం నినాదాన్ని అందుకున్నారని కూడా అంటున్నారు. అయితే బీసీసీ సీఎం నినాదం ఇచ్చినా ఎల్పీ నేతగా మళ్లీ రెడ్డి వర్గానికే పదవి ఇచ్చారు. దీనిపైనా ఈటల అసంతృప్తి గా ఉన్నారంటున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యి చాలా సేపు చర్చలు జరపడంతో త్వరలో ఆయన కమలం పార్టీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చర్చ జోరందుకుంది.
త్వరలో కాంగ్రెస్ పార్టీలో ఈటల రాజేందర్ చేరుతారనే చర్చకు.. అలాగే కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంపై ఈటల వర్గం క్లారిటీ ఇచ్చింది. పార్టీ మారుతారని వస్తున్న వార్తలను ఖండించింది. కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గృహ ప్రవేశంలో అందరూ కలిశారని.. అంతే కానీ రాజకీయాలపై చర్చలు చేసేందుకు కాదని వివరణ ఇచ్చింది. దీనిపై ఈటల రాజేందర్ మాత్రం ఇప్పటికి స్పందించక పోవడంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అభిప్రాయానికి వస్తున్నారు.