Hot Posts

6/recent/ticker-posts

ఎంపి కోటగిరి శ్రీధర్ ను సత్కరించిన జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్


ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు పార్లమెంట్ సభ్యులుగా తన పదవీ కాలం ఎంతో సంతృప్తినిచ్చిందని ఎంపి కోటగిరి శ్రీధర్ అన్నారు. శుక్రవారం దిశ సమావేశం అనంతరం ఏలూరు ఎంపి కోటగిరి శ్రీధర్ ను జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. 

ఈ సందర్బంగా ఎంపి శ్రీధర్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన సమావేశంలో అజెండాలోని అన్ని అంశాలను సమీక్షించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఎంపి హోదాలో ఇది ఆఖరి సమావేశంగా బావిస్తున్నానని గత 5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యునిగా, రాజకీయవాదినిగా ప్రజలకు అందించిన సర్వీసు తనకు సంతృప్తి ఇచ్చిందన్నారు. ప్రజలు ఆశించిన స్ధాయిలో పనిచేసి తన పదవీకాలం ముగింపుతో బయటకు వస్తున్నానన్నారు. ప్రజలు తమ పనిపై అధికారుల వద్దకు వచ్చిన సమయంలో మంచి పరిష్కారాన్ని చూపాలన్నారు. తాము రాజకీయంగా ఐదేళ్ల కాలపరిమితి ఉంటుందని అయితే ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసంతా ప్రజలకు సేవలను అందించే అవకాశం కలుగుతుందని దానిని సద్వినియోగం చేసుకొని ప్రజలకు అన్ని విధాలా మేలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. నా మనస్సు ఎప్పుడూ తన నియోజకవర్గం చుట్టునే ఉంటుందని ప్రజలకు మేలు చేయడంలో తాను ముందుంటానన్నారు.  

జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మన్ననలు పొందేలా ఎంపి కోటగిరి శ్రీధర్ సేవలు అందించారన్నారు. రైల్వే అంశాలకు సంబంధించి పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లడం చేశారన్నారు. ఎంతో సహృద్దులైన ఎంపి కోటగిరి శ్రీధర్ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలుస్తారన్నారు. ప్రజాధరణ కలిగిన ఎంపి కోటగిరి శ్రీధర్ భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు.  

జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో తమకు ఎంతో హుందాగా ఎంపి కోటగిరి శ్రీధర్ సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అధికారులపై ఎటువంటి వత్తిడి లేకుండా ప్రజా ప్రయోజన పనులను సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లారన్నారు.  

ఈ కార్యక్రమంలో జెడ్పి సి ఇ ఓ కె.ఎస్.ఎస్. సుబ్బారావు, దిశ కమిటీ సభ్యులు ఉంగుటూరు ఎంపిపి ఘంటా శ్రీలక్ష్మీ, చింతలపూడి ఎంపిపి డా. బి. రాంబాబు, కైకలూరు సర్పంచ్ వి. వసంతకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.