ఏలూరు: కేంద్ర ప్రభుత్వ పధకాల అమల్లో, వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమం నిర్వహణలో ఏలూరు జిల్లా పనితీరు భేషుగ్గా ఉందని రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు (మహిళలు, పిల్లలు మరియు యూత్ & స్పోర్ట్స్) వివేక్ ఠాకూర్ అన్నారు.
ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమ నిర్వహణ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి లతో కలిసి సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఆయా పధకాల అమలుకు సంబంధించి మరిన్ని సూచనలు, సలహాలు అందజేశారు.
ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యులు వివేక్ ఠాకూర్ మాట్లాడుతూ దేశ ప్రజలకోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టిందన్నారు. అందరికి అన్ని పధకాల లబ్దిచేకూరేలా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. సంక్షేమ పధకాలు వాటి ఉపయోగాలు, ఎవరూ వీటికి అర్హులనే పూర్తి సమాచారాన్ని అట్టడుగుస్ధాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. అర్హుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరుగకూడదన్నారు. అర్హులకు సక్రమంగా సంతృప్తి స్ధాయిలో పధకాలు అందించవలసిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాల ప్రయోజనాలను ఆయా లబ్దిదారులకు చేరవేసేందుకు ప్రాధన్యతనివ్వాలన్నారు.
ప్రధాన మంత్రి విశ్వకర్మయోజన కింద చేతివృత్తుల వారిని ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పైలేట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇంతవరకు 4,224 ధరఖాస్తులు అందాయని అయితే ఇంకా మరింత మంది ధరఖాస్తు చేసుకొని ప్రయోజనం పొందేలా చూడాలన్నారు. జిల్లాలో వికసిత్ భారత సంకల్పయాత్ర చేపట్టక ముందు, చేపట్టిన తర్వాత సంబంధిత అంశాల్లో ప్రగతి తీరు నివేదికను అందజేయాలని ఆయన కోరారు. ప్రకృతి, ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులకు ముఖ్యంగా కూరగాయలు, పండ్లు వంటి తాజా ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకొని రైతులు ఆర్ధికంగా మరింత ప్రయోజనం పొందేలా చూడాలన్నారు.
పిఎం ఉజ్వల యోజన కిందం దేశవ్యాప్తంగా మరో కోటి గ్యాస్ కనెక్షన్ లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఏలూరు జిల్లాలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో బాగంగా 19,902 గ్యాస్ కనెక్షన్ లు అందించడం అభినందనీయమన్నారు. జిల్లా 6.30 లక్షల రైస్ కార్డులు ఉండగా వారందరికి సంతృప్తిస్ధాయిలో ఉజ్వలయోజన కింద గ్యాస్ కనెక్షన్ లు అందించినట్లు అవుతుందన్నారు. అటల్ పెన్షన్ యోజన, సురక్షభీమాయోజన, పిఎం జన్ ధన్ యోజన కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఆయుష్మాన్ భారత్(పిఎంజెఎవై) అమలు తీరుపై ఆయన సమీక్షిస్తూ జిల్లాలో సంతృప్తి కరంగా ఉందన్నారు.
వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతోపాటు అవసరమైన మందులు ఇవ్వడం, వైద్యులు అందుబాటులో ఉండటం పరిశీలించానని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత ఆరోగ్య లామినేషన్ కార్డులను పూర్తిస్ధాయిలో త్వరగా పంపిణీ జరిగేలా చూడాలన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి ఆవాసయోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, తదితర కార్యక్రమాల అమలు తీరుపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. రైతులకు నానో ఫెర్టిలైజర్స్ ద్వారా ఎరువులు అందించడం ద్వారా నాణ్యమైన పంటలు పండించవచ్చన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఏలూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 ప్రధాన పధకాల ప్రగతి తీరును వివరించారు. కేంద్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన వికసిత్ బారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇంతవరకు 465 గ్రామ పంచాయితీల పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయన్నారు. అర్హులందరికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందించాలనే లక్ష్యంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు ఆయా పధకాల ద్వారా లబ్దిపొందిన వారి నుంచి సూచనలు, సలహాలు సేకరించడం జరిగిందన్నారు.
జిల్లోలో సచివాలయ వాలంటీరు వ్యవస్ధ ద్వారా క్షేత్రస్ధాయిలో మరింత సమర్ధవంతమైన పౌరసేవలు అందించబడుతున్నాయన్నారు. జిల్లా అమలవుతున్న గ్రీవెన్సెస్ పరిష్కారతీరు విధానాన్ని కలెక్టర్ వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వయంసహాయ సంఘాలు పరిపుష్టి, బలోపేతంగా ఉన్నాయన్నారు. తిరిగి రుణాల చెల్లింపులో కూడా మంచిపురోగతి ఉందన్నారు. సుమారు రూ. 10 లక్షల వరకు రుణాలు పొందిన సంఘాలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఏర్పాటైన 3 మహిళా మార్టులు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. పిఎం జన్ ధన్ ఖాతాల ప్రారంభానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం ద్వారా చాలా వరకు బ్యాంకు ఖాతాలు తెరిపంచడం జరిగిందన్నారు.
రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా వివిధ సంక్షేమ పధకాల ప్రయోజనాలను ఆయా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు డిబిటి పద్దతిలో చెల్పింపులు జరుగుతున్నాయన్నారు. అదే విధంగా ప్రతినెలా 1వ తేదీన తెల్లవారుజామునుంచే సామాజిక భధ్రత పెన్షన్లను ఆయా వాలంటీర్లద్వారా నేరుగా లబ్దిదారులకు అందించబడుతున్నాయన్నారు. జిల్లాలో ఆర్గానిక్, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఇప్పటికే సుమారు ఐదు ఎఫ్ పివో లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ కె.ఎస్.ఎస్. సుబ్బారావు, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వై. రామకృష్ణ, డి ఈ వో శ్యాంసుందర్, డిఎంహెచ్ఓ డా. శర్మిష్ట, జిల్లా పరిశ్రమల కేంద్రం జియం ఆదిశేషు, డిఎస్ఓ ఆర్ఎస్ఎస్ రాజు, ఎల్డిఎం నీలాధ్రి, ఎపిఎంఐపి పిడి రవికుమార్, మెప్మా పిడి బి.ఇమ్మన్యూల్, డ్వామా పిడి ఏ.రాము, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ఈ సత్యనారాయణ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎన్ ఎస్ కృపవరం, పశుసంవర్ధక శాఖ జేడీ జి.నెహ్రూ బాబు, మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఎస్.వెంకట కృష్ణ, సెరికల్చర్ డిడి డి. వాణి తదితరులు పాల్గొన్నారు.