తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరు ప్రకృతి వ్యవసాయంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి.. గ్రామాల్లో పర్యటన


ప్రకృతి వ్యవసాయంపై విదేశీ ప్రతినిధుల పరిశీలన

ఏలూరు, సెప్టెంబర్ 29:
ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించేందుకు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న విదేశీ ప్రతినిధుల బృందం మంగళవారం రెండో రోజు ఉంగుటూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం (APCNF) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పంటల సాగు విధానాలు, వ్యవసాయ నమూనాలను బృంద సభ్యులు పరిశీలించారు.

ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామంలో పి. సత్యనారాయణకు చెందిన ఫిష్ పేడీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ (IFS) మోడల్, ఉద్యాన పంటల సాగును బృందం పరిశీలించింది. అనంతరం పి. రాజేంద్రప్రసాద్ పొలంలో ఏర్పాటు చేసిన రైజ్డ్ బండ్ వరి సాగు మోడల్, ముర్రెల్ చేపల పెంపకం విధానాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.

తదుపరి ఏ. గోకవరం గ్రామంలోని యు. రామచంద్రరాజు ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన 5 లేయర్ ఫీల్డ్ ను ప్రతినిధులు సందర్శించారు. ఈ తోటలో కొబ్బరి, కోకో, వక్క, చేమ, పసుపు, కంద, ఆయిల్‌పామ్ తదితర పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.

అనంతరం సురభి గోశాలను సందర్శించిన బృందం, టి. మల్లేష్ పొలంలో 42 రకాల పంటలతో ఏర్పాటు చేసిన ATM మోడల్ ను పరిశీలించింది. భీమడోలు మండలంలోని అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన AWD ఎక్స్‌పెరిమెంట్ ప్లాంట్ ను కూడా బృంద సభ్యులు సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు, పంటలకు వినియోగించే అగ్నాస్త్రం, వేప కషాయం వంటి కషాయాలు, జీవామృతం, ఘన జీవామృతం వంటి జీవ ఉత్ప్రేరకాలు, కోడిగుడ్డు-నిమ్మరసం ద్రావణం వంటి గ్రోత్ ప్రమోటర్లు, విత్తన గుళికల తయారీ విధానాన్ని ప్రతినిధులు పరిశీలించారు. రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్న బృంద సభ్యులు ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అమలు చేస్తున్న విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇండోనేషియాకు చెందిన ఆస్టుంగ్‌కారా వే ఆర్గనైజేషన్ నుంచి 9 మంది, థాయిలాండ్‌కు చెందిన బోర్డర్‌లెస్ ఫౌండేషన్ నుంచి 2 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ఏలూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తోంది. APCNF ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు, వివిధ పంటలు, సాగు నమూనాలను పరిశీలించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి. వెంకటేష్, అడిషనల్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ షేక్ మహబూబ్ వలి, DPP సత్య, పి. డోలాంబికా, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పి. సత్యనారాయణ, పి. రాజేంద్ర, యు. రామచంద్రరాజు, టి. మల్లేష్, వి. వెంకటేశ్వరరావు, కే. ఆంజనేయులు, చ. కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతినిధి బృందంలో తిమోతీ జోసెఫ్ ఫిజాల్, షానన్ లీ గ్రీఫ్, సోఫియా యోహానా, ఐ గుస్తీ న్గురా ప్రభూ వీర, అల్వాన్ విజయ కుసుమ, నినా హార్నిదియా, నధిఫ్ అల్వాన్ కమిల్, ని కేతుత్ విద్యా అస్తుతి, క్రెయిగ్ ఆండ్రూ ఎల్లిస్, యాగిషితా టోమోనోబు, ఆంగ్ ఫ్యో ఓ తదితరులు ఉన్నారు.