తాజా వార్తలు

10/recent/ticker-posts

3 నెలల చిన్నారికి కొత్త కుటుంబం.. ఫైనల్ అడాప్షన్ ఆర్డర్ అందజేసిన కలెక్టర్


దత్తత మానవత్వానికి ప్రతీక: కలెక్టర్ వెట్రిసెల్వి


ఏలూరు, సెప్టెంబర్ 29:
దత్తత తీసుకోవడం మానవత్వానికి ప్రతీక అని, అమ్మతనానికి అందం, కుటుంబానికి ఆనందాన్ని అందిస్తుందని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.

ఏలూరు కలెక్టరేట్‌లో మంగళవారం మూడు నెలల వయస్సున్న బేబీ కృతిక ను దత్తత తీసుకున్న చెన్నై, తమిళనాడుకు చెందిన కుమారీ–మధు శ్రీనివాసన్ దంపతులకు కలెక్టర్ ఫైనల్ అడాప్షన్ ఆర్డర్‌ను అందజేశారు.

జూలై 23న బేబీ కృతికను ప్రీ-అడాప్షన్ ఫాస్టర్ కేర్‌లో భాగంగా ఏలూరులోని శిశుగృహంలో తాత్కాలికంగా ఉంచారు. అనంతరం నిబంధనల ప్రకారం కుమారీ–మధు శ్రీనివాసన్ దంపతులకు దత్తత ప్రక్రియ పూర్తిచేశారు. నిర్ణీత 60 రోజుల వ్యవధి పూర్తికావడంతో మంగళవారం కలెక్టర్ తుది దత్తత ఉత్తర్వులను దత్తత తల్లిదండ్రులకు అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ దత్తత తీసుకున్న పిల్లలను తల్లిదండ్రులు ప్రేమతో పెంచాలని, వారి ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లలకు మంచి విద్య అందించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్. సూర్య చక్రవేణి, డిసిపియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.