తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరులో పారిశుద్ధ్య పనులు ముమ్మరం.. జేసీ ఆకస్మిక తనిఖీలు


ఏలూరు, సెప్టెంబర్ 26: భారీ వర్షాల అనంతరం ఏలూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను జిల్లా జాయింట్ కలెక్టర్, ఏలూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డా. ఎం.జె. అభిషేక్ గౌడ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చాటపర్రు రోడ్డులోని బాలాజీనగర్‌లో ముంపు పరిస్థితులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


నగరంలోని డ్రైన్లలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మురుగునీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతోందని జేసీ పేర్కొన్నారు. రెండు రోజులపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేసి రోడ్లపై ఎక్కడా చెత్త లేకుండా, డ్రైన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రతిరోజూ ఉదయం నుంచే పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపు చేపట్టాలని, ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. దోమల వ్యాప్తిని నివారించేందుకు డ్రైన్లలో సిల్ట్ తొలగించడంతో పాటు పిచ్చిమొక్కలు, పొదలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా అపారిశుద్ధ్య పరిస్థితులు కనిపిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు.

**దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం:** చాటపర్రు రోడ్డులోని బాలాజీనగర్‌లో పెద్ద డ్రైన్‌లో మురుగునీరు, సిల్ట్‌ను తొలగించడంతో భారీ వర్షాల సమయంలో కాలనీలోకి చేరిన వరదనీరు సులభంగా దిగువకు వెళ్లిపోయింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న మురుగునీటి పారుదల సమస్యకు పరిష్కారం లభించిందని స్థానిక ప్రజలు జాయింట్ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

నగరంలో పారిశుద్ధ్య పనులను జేసీ దగ్గరుండి పర్యవేక్షించారు. ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ. భానుప్రతాప్, పారిశుద్ధ్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.