తాజా వార్తలు

10/recent/ticker-posts

“దివ్యాంగులకు ప్రేమ, ఆప్యాయతలు పంచాలి”.. కలెక్టర్ వెట్రిసెల్వి


దివ్యాంగులకు ప్రేమ, ఆప్యాయతలు పంచాలి: కలెక్టర్ వెట్రిసెల్వి


ఏలూరు, సెప్టెంబరు 29:
దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో వ్యవహరించి, వారికి ప్రేమ, ఆప్యాయతలను పంచాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, వృద్ధులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

దివ్యాంగులు స్వయంగా తయారు చేసిన వివిధ వస్తువులను కలెక్టర్ పరిశీలించారు. వారి ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేశారు. అనంతరం జిల్లా సంకేత భాషల సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను జ్ఞాపికలు, శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంకేత భాష సమ్మిళిత సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వినికిడి, మాట్లాడే సామర్థ్యంలో ఇబ్బందులు ఉన్న వ్యక్తులు తమ భావాలను వ్యక్తం చేసుకోవడంతో పాటు హక్కులను కాపాడుకోవడానికి సంకేత భాష ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

సంకేత భాష కేవలం సమాచార మార్పిడి మాధ్యమం మాత్రమే కాదని, వినికిడి లోపం ఉన్నవారి ఆత్మగౌరవం, భావవ్యక్తీకరణకు ఇది ముఖ్యమైన సాధనమని కలెక్టర్ పేర్కొన్నారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో సమానంగా రాణించేందుకు అవసరమైన అవకాశాలు కల్పించాలని సూచించారు.

ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో సంకేత భాషను ప్రోత్సహిస్తూ సమ్మిళిత వాతావరణాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారికి పూర్తిస్థాయిలో చేరువ చేస్తామని తెలిపారు.

చిరు వ్యాపారాలు నిర్వహించాలనుకునే దివ్యాంగులకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆసక్తి ఉన్న వారు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. దివ్యాంగుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని, వారిపట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కోరారు.

కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు, సెట్వెల్ సీఈవో కె.ఎస్. ప్రభాకరరావు, డీఆర్‌డీఏ పీడీ టి.వి. విజయలక్ష్మి, మెప్మా పీడీ ఎం. రాజబాబు, జిల్లా టూరిజం మేనేజర్ ఎస్. పట్టాభిరామన్న, జిల్లా సంకేత భాషల అధ్యక్షులు గాదిరాజు ప్రవీణ్ వర్మ, కార్యవర్గ సభ్యులు, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు, డీఆర్‌డీఏ, మెప్మా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.