ఇద్దరు బాలికలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక భరోసా
ఏలూరు, సెప్టెంబర్ 29:
కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించే ప్రధానమంత్రి కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద ఇద్దరు బాలికలకు రూ.10 లక్షల చొప్పున జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెక్కులను అందజేశారు.
మంగళవారం ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భీమడోలుకు చెందిన కుమారి కమరపు గోపిక శ్రీ, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కుమారి జుజ్జవరపు సాయి భార్గవికి ఈ చెక్కులను కలెక్టర్ అందించారు. 23 సంవత్సరాల వయస్సు పూర్తయిన అనంతరం పథకం కింద అందుతున్న రూ.10 లక్షల మొత్తంతో పాటు పోస్టాఫీస్ ఖాతాలో జమ అయిన వడ్డీకి సంబంధించిన పాస్ పుస్తకాలను కూడా వారికి అందజేశారు.
కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు ఆర్థిక భరోసా కల్పించి, వారి భవిష్యత్తుపై ఆశలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పథకం కింద లభించిన మొత్తాన్ని బాలికలు తమ భవిష్యత్తు అవసరాలకు జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. బాలికలకు కుటుంబ సభ్యుల సహకారంతో పాటు భవిష్యత్తులో జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందుతుందని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్. సూర్యచక్రవేణి, డీసీపీయూ సిబ్బంది శ్రీకాంత్, మహేష్, శంకర్, రాజకుమార్, బాలికల గార్డియన్లు పాల్గొన్నారు.



