తాజా వార్తలు

10/recent/ticker-posts

విజయవాడ–అమరావతిలో 10 వేల మందితో భారీ రన్.. అక్టోబర్ 2న ‘స్వచ్ఛతాన్’


అక్టోబర్ 2న విజయవాడ–అమరావతిలో ‘స్వచ్ఛతాన్’ మారథాన్

10 వేల మందితో భారీ పరుగుకు సన్నాహాలు

విజయవాడ, సెప్టెంబర్ 29:
పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడమే లక్ష్యంగా అక్టోబర్ 2న విజయవాడ–అమరావతి ప్రాంతంలో ‘స్వచ్ఛతాన్’ మారథాన్ నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ తెలిపారు. గాంధీ జయంతి, స్వచ్ఛ దివస్ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మారథాన్‌లో సుమారు 10 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

విజయవాడలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మారథాన్ వివరాలను ఆయన వెల్లడించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ ఉద్యమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.



గత ఏడాది నిర్వహించిన ‘స్వచ్ఛతాన్’ తొలి ఎడిషన్ విజయవంతమైందని, ఈసారి రెండో ఎడిషన్‌ను మరింత పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్నామని పట్టాభి రామ్ తెలిపారు. ఈ ఏడాది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోందన్నారు. 5కె, 10కె, 21కె హాఫ్ మారథాన్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు, విజేతలకు మొత్తం రూ.10 లక్షల నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.

అక్టోబర్ 2న ఉదయం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి మారథాన్ ప్రారంభమవుతుంది. మంత్రి నారా లోకేశ్ ఫ్లాగ్‌ఆఫ్ చేయనున్నారు. మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, పొంగూరు నారాయణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మారథాన్ మార్గం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్, వినాయకుడి గుడి, సీతమ్మ వారి పాదాలు, కృష్ణా బ్యారేజ్, స్టీల్ బ్రిడ్జి మీదుగా అమరావతి రాజధాని ప్రాంతంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు కొనసాగి, తిరిగి విజయవాడకు చేరుకునేలా ఏర్పాటు చేశారు.

మారథాన్‌కు విజయవాడ పోలీస్ కమిషనరేట్, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ సమన్వయంతో బందోబస్తు, రూట్ క్లియరెన్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 10కె, 21కె విభాగాల్లో పాల్గొనే రన్నర్లకు టైమింగ్ బిబ్స్‌ను అమ్మా కల్యాణమండపం వద్ద అందించనున్నారు. మార్గమధ్యంలో డ్రమ్మర్లు, కళాబృందాల ప్రదర్శనలు, జుంబా తదితర కార్యక్రమాలతో రన్నర్లను ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి అమరావతి రన్నర్స్ ఆర్గనైజింగ్ పార్ట్‌నర్‌గా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టైటిల్ స్పాన్సర్‌గా, మెడ్సిటీ మెడికల్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాగా, రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి కూడా 5కె రన్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

దసరా ఉత్సవాలకు విజయవాడ నగరం సిద్ధమవుతున్న నేపథ్యంలో ‘స్వచ్ఛతాన్’ మారథాన్ దసరా ఉత్సవాలకు కర్టెన్ రైజర్‌గా నిలవనుందని పట్టాభి రామ్ తెలిపారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు.

విలేకరుల సమావేశంలో అమరావతి రన్నర్స్ ప్రతినిధి రావి రమేష్, హెచ్‌డీఎఫ్‌సీ ఏరియా హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ప్రతినిధి పవన్, మెడ్‌స్టార్ హాస్పిటల్స్ ప్రతినిధి ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.