అమలాపురం, కోనసీమ జిల్లా: షెడ్యూల్డ్ కులాలకు చెందిన క్రైస్తవులపై అన్యాయం చేస్తున్న 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గడియార స్తంభం నుండి నల్ల వంతెన మీదుగా ఎర్ర వంతెన వరకు సాగిన ఈ ర్యాలీలో దాదాపు పదివేల మంది క్రైస్తవ సోదరులు, సోదరీమణులు పాల్గొన్నారు. ర్యాలీ మధ్యలో మోకాళ్లపై కూర్చొని ప్రార్థనలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నిరసనకారులు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి, తమ డిమాండ్లను ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ జేఏసీ నాయకులు వి. రాజ్ కుమార్, ఎం. యెహోషువ, కార్ల్ డేవిడ్, వై. శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, యుపిఎఫ్, కెపిడబ్ల్యు, ఇస్సాకు ఫౌండేషన్, ఎఫ్‌ఎఫ్‌సీఐ, టౌన్ యూత్ సంఘాలు, మహిళా సంఘాలు, దళిత సంఘాలు మరియు 22 మండలాల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నాయకులు మాట్లాడుతూ, మతం మారిన కారణంగా దళిత క్రైస్తవులకు రాజ్యాంగ హక్కులు దూరం కావడం అన్యాయమని, దీనిని వెంటనే సరిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
ఈ నిరసన కార్యక్రమం అమలాపురంలో పెద్ద ఎత్తున స్పందన తెచ్చుకుంది. శాంతియుతంగా నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.


