తాజా వార్తలు

10/recent/ticker-posts

దెందులూరులో పెండింగ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ – ఎమ్మెల్యే


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 6: దెందులూరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి కలెక్టర్ విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా, మండలాల వారీగా జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తూ ఆలస్యమైన పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.


పంచాయతీ రాజ్, రోడ్లు మరియు భవనాల శాఖల ద్వారా మంజూరైన రోడ్లు, భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జల్ జీవన్ మిషన్, ఆర్‌డబ్ల్యూఎస్, జలధార – జలహారతి పథకాల కింద మంజూరైన తాగునీటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ మరమ్మతులు మరియు ఇతర మౌలిక సదుపాయాల లోటుపాట్లు పూర్తిగా సరిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రత మరియు మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, నిరుపేదలకు గృహ నిర్మాణాలను పూర్తిచేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయడం, గ్రామాల్లో తడి–పొడి చెత్త సేకరణను సమర్థంగా నిర్వహించడం వంటి అంశాలపై కూడా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. డ్రైనేజీల్లో పూడిక తొలగించి మురుగునీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్ర వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేయాలని కోరారు. రోడ్డు ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిలు, ప్రధాన రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. గృహనిర్మాణం, తాగునీటి సరఫరా, విద్యా మరియు వైద్య సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, అవసరమైతే పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లను మార్చాలని అధికారులకు సూచించారు.

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోవడం, ముఖ్యమైన ప్రాంతాల్లో బస్సులు ఆపకపోవడం వల్ల విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని కోరారు. అలాగే విద్యుత్ శాఖ తహసీల్దార్ అనుమతి లేకుండా చెట్ల తొలగింపు కార్యక్రమాలు చేపడుతోందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

దెందులూరు నియోజకవర్గంలో సూర్యఘర్ పథక అమలులో ముందంజలో ఉన్నప్పటికీ, ఎస్సీ–ఎస్టీ కుటుంబాలకు 100 శాతం సబ్సిడీ పథకం అమలులో విద్యుత్ శాఖ వెనుకబడి ఉందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఈ పథకం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే డ్వాక్రా భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇన్‌చార్జి ఆర్డీవో ఎం. ముక్కంటి, జెడ్పీ సీఈవో పి. జగదాంబ, డీఆర్‌డీఏ పీడీ టి.వి. విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.