తాజా వార్తలు

10/recent/ticker-posts

416 మందికి ఉద్యోగాలు – ‘ఎచీవర్స్ డే 2026’


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 30: స్థానిక సర్ సి ఆర్ రెడ్డి అటానమస్ కళాశాలలో 2025–2026 విద్యాసంవత్సరంలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల ద్వారా విశేష ఫలితాలు నమోదయ్యాయి. సుమారు 50 కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లలో మొత్తం 416 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 292 మంది యూజీ కళాశాల నుంచి, 124 మంది పీజీ కళాశాల నుంచి ఎంపిక కావడం విశేషం. ప్రతి విద్యార్థి సగటున రెండు సంస్థలలో ఎంపిక కావడం సంస్థ ప్రతిష్టను మరింత పెంచింది.


ఈ విజయాన్ని పురస్కరించుకుని మే 1, 2026 (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు కళాశాలలోని యార్లగడ్డ కళ్యాణ చక్రవర్తి ఆడిటోరియంలో “ఎచీవర్స్ డే 2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాలు మరియు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ కార్యక్రమానికి సర్ సి ఆర్ ఆర్ విద్యాసంస్థల అధ్యక్షులు డా. అల్లూరి ఇంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. విద్యార్థుల సాధనను అభినందిస్తూ వారికి ప్రోత్సాహం అందించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్‌పై మార్గదర్శక సందేశం ఇవ్వనున్నారు.

కార్యక్రమంలో విద్యాసంస్థల పాలకవర్గ ఉపాధ్యక్షులు డా. వి.వి. బాలకృష్ణారావు, శ్రీ ఏ.వి. సుబ్రహ్మణ్యం, కార్యదర్శి డా. ఎం.బి.ఎస్.వి. ప్రసాద్, జాయింట్ సెక్రటరీలు శ్రీ వంకినేని భానుప్రకాష్, శ్రీ వి. శ్రీకృష్ణ, కోశాధికారి బి.బి.వి.వి. ప్రసాదరావు పాల్గొంటారు. అలాగే డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డా. కె.ఎస్. విష్ణుమోహన్, పీజీ కళాశాల కరస్పాండెంట్ శ్రీ కానాల శ్రీనివాసరావు కూడా హాజరవుతారు.

సి ఆర్ ఆర్ విద్యాసంస్థల సీఈఓ డా. కిషన్ కాజా, ప్రిన్సిపాల్ డా. ఎం.వి. చక్రధరరావు, పీజీ కోర్సెస్ డైరెక్టర్ డా. వి.ఆర్.ఎస్. బాబు యలమర్తి మరియు అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే ఈ కార్యక్రమం కళాశాల చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని ప్రిన్సిపాల్ తెలిపారు.