అనంతపురం అర్బన్, పశ్చిమ వాహిని, మే 04: అనంతపురం నగరంలో జర్నలిస్ట్ లక్ష్మీనారాయణపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతం విద్యాసంస్థల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు.
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి మాట్లాడుతూ, విద్యాసంస్థలలో జరుగుతున్న అవకతవకలపై వార్త రాసినందుకు జర్నలిస్ట్‌పై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి, భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్య అని పేర్కొన్నారు. వార్తపై అభ్యంతరం ఉంటే చట్టపరంగా స్పందించాల్సిందిపోయి, ఇంటికెళ్లి దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని అన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా, జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఉచిత విద్య పేరుతో ప్రచారం చేస్తూ, హాస్టల్ మరియు ఇతర ఖర్చుల పేరుతో భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారని తెలిపారు. అమాయక తల్లిదండ్రులు, విద్యార్థులు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆర్‌ఐఓ కార్యాలయ పనితీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ చర్యలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు పునరావృతమవుతున్నాయని పేర్కొన్నారు.
గీతం విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు మంజునాథ్, జిల్లా సహాయ కార్యదర్శి చందు, నగర కోశాధికారి నాని, నాయకులు సమీర్, సుశ్రీత్, బాబ్జాన్, దినేష్, బాబీ, కార్తీక్, ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


