తాజా వార్తలు

10/recent/ticker-posts

అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాధారంగా నిలిచిన పోలీస్ అధికారుల సంఘం సభ్యుడు


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 6: ఏలూరులోని ఆశ్రం హాస్పిటల్‌లో అత్యవసర గుండె శస్త్రచికిత్స కోసం చికిత్స పొందుతున్న 60 ఏళ్ల శ్రీ కె. సత్యనారాయణకు అరుదైన B నెగటివ్ రక్తం అత్యవసరంగా అవసరమైన సమయంలో అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్న ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం సభ్యుడు పీతల కిషోర్ వెంటనే స్పందించి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.


ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న వెంటనే పీతల కిషోర్ హాస్పిటల్‌కు చేరుకుని అవసరమైన రక్తాన్ని అందించారు. అత్యంత అరుదైన రక్త గ్రూప్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలో ఆయన చేసిన సహాయం రోగికి ప్రాణాధారంగా మారింది. ఈ సేవాభావం పట్ల వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది మరియు రోగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

పీతల కిషోర్ ఇప్పటికే 26 సార్లు రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ముందుండి స్పందిస్తూ పలువురికి సహాయం అందిస్తున్న ఆయన సేవలను పలువురు అభినందించారు. రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని, యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో స్వచ్ఛంద రక్తదాతలు చేసే సేవ ఎంతో విలువైనదని పేర్కొన్నారు. రక్తదానం చేయడానికి ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ముఖ్యంగా అరుదైన రక్తగ్రూప్ కలిగిన వారు అవసర సమయంలో స్పందించాలని కోరారు.