ఏలూరు, పశ్చిమ వాహిని, మే 6: విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన ఏలూరు జిల్లా హోంగార్డు యూనిట్‌కు చెందిన హోంగార్డు ఎం. వీరబాబు కుటుంబానికి జిల్లా పోలీసు యంత్రాంగం అండగా నిలిచింది. యాక్సిస్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.30 లక్షల బీమా చెక్కును జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ బుధవారం వీరబాబు భార్య రామలక్ష్మీ దేవికి అందజేశారు.
ఇంతకుముందు 29.04.2026న ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హోంగార్డు యూనిట్ ఫ్లాగ్ ఫండ్ నుంచి రూ.10 వేల ఆర్థిక సహాయం, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం మరో రూ.10 వేలతో పాటు ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ (PGI) కింద మంజూరైన రూ.11.40 లక్షల బీమా చెక్కును కూడా ఎస్పీ అందజేశారు. తాజాగా యాక్సిస్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ద్వారా మరో రూ.30 లక్షల సహాయం అందడంతో కుటుంబానికి గణనీయమైన ఆర్థిక ఊరట లభించింది.
ఈ సందర్భంగా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ హోంగార్డు ఎం. వీరబాబు విధుల పట్ల ఎంతో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. 19 జనవరి 2026న ఆయన మరణించడం హోంగార్డు విభాగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. హోంగార్డు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
బీమా సొమ్ము త్వరితగతిన అందేలా సహకరించిన యాక్సిస్ బ్యాంక్ అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. యాక్సిస్ బ్యాంక్ క్లస్టర్ ఇన్‌చార్జ్ ఏ. రవిచంద్ర, ఏలూరు బ్రాంచ్ మేనేజర్ కె. అనిల్, కోఆపరేటివ్ శాలరీ మేనేజర్ డి. సురేష్ సేవలను ప్రశంసించారు. పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సిబ్బంది భద్రత, కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ బి-సెక్షన్ సూపరింటెండెంట్ పి. నాగేశ్వరరావు, పోలీస్ కార్యాలయ సిబ్బంది, హోంగార్డు విభాగ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


