శిశు మరణాల నివారణకు రూ.8.86 లక్షలతో వైద్య సదుపాయాల విస్తరణ
ఏలూరు, పశ్చిమ వాహిని, మే 6: ఏలూరులోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రసవ సమయంలో శిశు మరణాలను తగ్గించేందుకు ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎం.ఎస్. రాజు తెలిపారు. రూ.8,86,900 వ్యయంతో కొనుగోలు చేసిన నూతన వైద్య పరికరాలను మంగళవారం ఆసుపత్రి వైద్యుల సమక్షంలో పరిశీలించారు. ఈ పరికరాల ద్వారా తక్కువ బరువుతో జన్మించిన శిశువులు మరియు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నవజాత శిశువులకు మెరుగైన వైద్యం అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.
సిపిఏపి మిషన్ విత్ అనలైజర్ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న శిశువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డా. రాజు తెలిపారు. హెమటాలజీ అనలైజర్ ద్వారా నవజాత శిశువులు, పీడియాట్రిక్ వార్డులో ఉన్న పిల్లలకు వేగవంతంగా రక్త పరీక్షలు నిర్వహించవచ్చన్నారు. పల్స్ ఆక్సీమీటర్ ద్వారా స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ (SNCU)లో శిశువుల ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించవచ్చని వివరించారు.
అలాగే సిరంజ్ పంప్స్ ద్వారా తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు ఐవి ఫ్లూయిడ్స్, ప్రాణరక్షక మందులు సమయానికి అందించవచ్చన్నారు. పోర్టబుల్ సక్షన్ మిషన్ ద్వారా అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు అత్యవసర చికిత్స అందించవచ్చని చెప్పారు. SNCUలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇన్వర్టర్ విత్ బ్యాటరీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీన్ ఫైండర్స్ ద్వారా కష్టమైన కేన్యులేషన్ ప్రక్రియను సులభతరం చేయవచ్చన్నారు.
ఈ ఆధునిక పరికరాల వినియోగంతో శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించవచ్చని, ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేసే అవసరం కూడా తగ్గుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డా. బ్రహ్మయ్య, డా. ప్రశాంత్ కుమార్, డా. మాధవి, డా. ప్రియదర్శిని, డా. పూర్ణ రాజీవ్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్, బయో మెడికల్ ఇంజనీరింగ్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


