ANDHRAPRADESH:డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో: మూలస్థానం అగ్రహారం లంకల్లో గోదావరిలో ఎర్ర నీరు చేరిందంటే ఆ ప్రాంత ప్రజలకు, రైతులకు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ప్రమాదకరమైన వరదలు ముంచెత్తితే ఎవరూ ఏమి చేసేది ఉండదు. కాని చిన్నపాటి వరదనీటికే ముంపుకు గురై రాకపోకలు స్తంభించిపోతుంది. ఆ సమస్యను పరిష్కరించాలని ఎప్పటినుంచో ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం రైతులు అలాగే రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన తోకలంక ప్రజలు వేడుకుంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ సమస్యనే వారు లేవనెత్తారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనలతో రూ.ఎనిమిది లక్షలతో అక్కడ తూరలు వేసి కాజ్ వే నిర్మిస్తున్నారు. ఈ కాజ్ వే వల్ల ఏమవుతుందంటే చిన్నపాటి వరద నీటికి ముంపు సమస్య ఉండదు.తూరలు ద్వారా నీరు వెళ్లిపోవడం వల్ల రాకపోకలు సాగించవచ్చు. అదీకాక ఇప్పటివరకు వరదలు వచ్చి వెళ్లినప్పటికీ ఈ పాయలోని నీరు నెలల తరబడి తగ్గేది కాదు. ఆ సమయంలో తోకలంక ప్రజలతో పాటు రైతులకు తీవ్ర అవస్థలు ఎదురయ్యేవి.
ఇప్పుడు ఈ కాజ్ వే నిర్మించడం వల్ల భారీగా వరదలు వచ్చినప్పుడు తప్ప సాధారణ రోజుల్లో ఇబ్బందులు ఉండవు.మూలస్థానం ఏటిగట్టు దిగువన గల పాయలో దీనిని నిర్మిస్తున్నారు. మండల పరిషత్ నుంచి రూ.5 లక్షలు మంజూరు కాగా ఆ గ్రామస్తులు మరో మూడు లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మొత్తం రూ.ఎనిమిది లక్షలతో అక్కడ కాజ్ వే నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణ పనులను సోమవారం స్థానిక ఎంపీడీవో ఎ. రాజు పరిశీలించారు. వీలైనంత తొందరలోనే నిర్మాణ పనులు పూర్తయ్యాలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Vijaya Babu. I
Staff Report | Konaseema