ఏలూరు, టి.నరసాపురం, పశ్చిమ వాహిని, జూన్ 11: స్థానిక మండల కేంద్రంలో బుధవారం మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నాయుడు రామకృష్ణారావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి నెల తొలి బుధవారం గ్రామ స్థాయిలో, రెండో బుధవారం మండల స్థాయిలో, మూడో బుధవారం నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి రవి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయవరపు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయుడు రామకృష్ణారావు మాత్రమే అధికారిక మండల అధ్యక్షుడని జిల్లా పార్టీ అధ్యక్షుడు బడేటి చంటి స్పష్టం చేసినట్లు తెలిపారు. పార్టీ అధిష్టానం ఇప్పటివరకు మరెవరికీ ఎలాంటి పదవులను కేటాయించలేదని, అలాగే ఎలాంటి నియామకాలను ఆమోదించలేదని ఆయన తేల్చిచెప్పినట్లు పేర్కొన్నారు.
మండల పార్టీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. బీసీల పేరును ముసుగుగా ఉపయోగించుకుని కొందరు నాయకులు వ్యక్తిగత పదవుల కోసం పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు నాయకులు విమర్శించారు. ఇటువంటి చర్యల కారణంగా పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
మండలంలో కొనసాగుతున్న వర్గ పోరు కారణంగా సాధారణ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని, అంతర్గత విభేదాలు ఇలాగే కొనసాగితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. పరిస్థితిని అధిష్టానం వెంటనే పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో కేతవరం పీఏసీఎస్ చైర్‌పర్సన్ బొంతు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ నార్ని వెంకట్రావు, టీడీపీ సీనియర్ నాయకులు కోరుకొండ వెంకటభద్రం, పెద్దిన సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



