తాజా వార్తలు

10/recent/ticker-posts

హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి.. భీమడోలు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ


భీమడోలు, పశ్చిమ వాహిని, మే 8: రహదారి ప్రమాదాల నివారణ లక్ష్యంగా భీమడోలు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మరియు ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు భీమడోలు ఇన్‌స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐ షేక్ మదీనా బాషా తమ సిబ్బందితో కలిసి సూరప్పగూడెం గ్రామం సమీపంలోని NH-16 వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు.


ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించకుండా, వారితోనే 20 హెల్మెట్లు కొనుగోలు చేయించి అవగాహన కల్పించారు. ఇకపై హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

తనిఖీల సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారు, సరైన పత్రాలు లేని వాహనదారులకు రహదారి భద్రతపై కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రమాదాల వల్ల కుటుంబాలు ఎదుర్కొనే ఆవేదనను వివరించి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ కృష్ణ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మోటార్ సైకిళ్లు నడిపే వారు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, థ్రిల్ కోసం బైక్‌లను వేగంగా నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని పోలీసులు హెచ్చరించారు. ప్రమాద సమయంలో తలకు తగిలే చిన్న గాయం కూడా ప్రాణాంతకమవుతుందని, హెల్మెట్ ధరించడం ద్వారా మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించిన పోలీసులు, నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారు.

“మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోంది. ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రాణాలను కాపాడుకోండి” అని భీమడోలు ఇన్‌స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐ మదీనా బాషా ప్రజలకు పిలుపునిచ్చారు.