తాజా వార్తలు

10/recent/ticker-posts

ప్రజలతో మమేకమైన పోలీసులు.. మత్తు పదార్థాలపై అవగాహన


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 8: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై భద్రతపై విశ్వాసం పెంపొందించేందుకు ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మరియు ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు గణపవరం మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టారు.


నిడమర్రు ఇన్‌స్పెక్టర్ రజనీ కుమార్, గణపవరం ఎస్ఐ మణికుమార్ మరియు పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలతో సమావేశమై పలు సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలను వివరించి ప్రజలను అప్రమత్తం చేశారు.

గంజాయి విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1972ను వినియోగించాలని తెలిపారు.

ఇంటి దొంగతనాల నివారణకు ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం అందిస్తే పది నిమిషాల్లోపు పోలీసు సహాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

సైబర్ నేరాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా నిడమర్రు ఇన్‌స్పెక్టర్ రజనీ కుమార్ మాట్లాడుతూ పల్లె నిద్ర కార్యక్రమాల ద్వారా ప్రజలతో పోలీసుల అనుబంధం మరింత బలపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.