తాజా వార్తలు

10/recent/ticker-posts

రాష్ట్ర స్థాయిలో ఏలూరు పోలీసులకు అరుదైన గౌరవం.. “బెస్ట్ రికవరీ అవార్డు” అందుకున్న ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్


ఏలూరు, పశ్చిమ వాహిని, మే 8: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఏలూరు జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్ర స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో “బెస్ట్ రికవరీ అవార్డు”ను ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ చేతుల మీదుగా అందుకున్నారు.

ఆపరేషన్ “రిస్టోర్” ద్వారా ఏలూరు జిల్లా పోలీసులు మొత్తం 2,746 సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.4 కోట్ల 11 లక్షల 90 వేలుగా ఉండగా, ఆ ఫోన్లను బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి అందజేయడం విశేషంగా నిలిచింది.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ సమర్థ నాయకత్వంలో సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ దాసు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం మరియు స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ ఘనత సాధించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగించి పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అసలు యజమానులకు అప్పగించడం ద్వారా ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేక గుర్తింపు పొందారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ ప్రజల ఆస్తులను రక్షించడంలో ఏలూరు పోలీసులు చూపుతున్న చొరవ అభినందనీయమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రశంసించారు.

ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వడం, వారి మొబైల్ ఫోన్లను ఇంటి వద్దకే అందించడం వల్ల పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతోందని డీజీపీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ ఈ అవార్డు జిల్లా పోలీస్ శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది కృషికి దక్కిన గౌరవమని అన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే CEIR వెబ్ పోర్టల్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సాంకేతికత ఆధారంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఏలూరు జిల్లా పోలీస్ శాఖ సాధించిన ఈ విజయంపై జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు ఎస్పీ గారిని, పోలీస్ బృందాన్ని అభినందించారు.