ఏలూరు, పశ్చిమ వాహిని, మే 8: ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు సైబర్ నేరాలు, పిల్లల భద్రతపై జాగ్రత్తలు తెలియజేయడానికి ద్వారకా తిరుమల పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏలూరు డీఎస్పీ శ్రీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో భీమడోలు ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణ ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల ఎస్ఐ శ్రీ సుధీర్ పంగిడిగూడెం గ్రామ ప్రజలతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ సుధీర్ మాట్లాడుతూ దేశంలో అమల్లోకి వచ్చిన నూతన చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో (POCSO) చట్టం గురించి వివరించారు. చిన్నారులపై అసభ్య ప్రవర్తన లేదా వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయవద్దని, ఓటీపీ (OTP) వివరాలను ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.
వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలు చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా పర్యవేక్షించాలని, అపరిచితులతో మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 ద్వారా పోలీస్ సహాయం పొందవచ్చని వివరించారు. గ్రామాల్లో మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగం గమనిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా నిర్మించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రజలు, పోలీసులు సమన్వయంతో పనిచేస్తేనే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


