తాజా వార్తలు

10/recent/ticker-posts

ఉపాధి హామీ శ్రామికులకు మజ్జిగ పంపిణీ.. దివంగత నేత మండం రాధాకృష్ణ జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం


టి.నర్సాపురం, పశ్చిమ వాహిని, మే 8: మండలంలో దివంగత టిడిపి నాయకుడు మండం రాధాకృష్ణ జ్ఞాపకార్థంగా ఆయన కుటుంబ సభ్యులు చేపట్టిన సేవా కార్యక్రమం ప్రశంసలు అందుకుంటోంది. మండం రాధాకృష్ణ కుమారుడు మండం ఆదిత్య మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉపాధి హామీ శ్రామికులకు రెండు రోజులపాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.


నందమూరి విజయసాగర్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది ఉపాధి హామీ శ్రామికులకు మజ్జిగ పంపిణీ చేశారు. మండుతున్న ఎండల్లో శ్రామికుల దాహార్తి తీర్చేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని సామాజిక కార్యకర్తలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ టి.నర్సాపురం మండలంలో మండం రాధాకృష్ణ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజలకు ఎప్పుడూ అండగా నిలిచిన నాయకుడిగా ఆయన పేరు నిలిచిపోయిందన్నారు.

తండ్రి జ్ఞాపకార్థంగా మండం ఆదిత్య మరియు కుటుంబ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందిస్తూ ఔదార్యం చాటుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. వేసవి కాలంలో “మంది వద్దకే మజ్జిగ” వంటి సేవా కార్యక్రమాలకు మరిన్ని దాతలు ముందుకు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఎస్.డి. నాసర్ పాషా, కొరివి నాగేశ్వరరావు, పింగుల మధు, ఫీల్డ్ అసిస్టెంట్ బైగాని రామచంద్రరావు, ఉపాధి హామీ శ్రామికులు మరియు స్థానికులు పాల్గొన్నారు.